బీజేపీలోకి మంత్రి మల్లారెడ్డి ప్రధాన అనుచరుడు సుదర్శన్ రెడ్డి

14-08-2022 Sun 13:27
  • త్వరలో చేరతారని ప్రకటించిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
  • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడి
  • స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం, అధికారాల్లేవని విమర్శ
minister Mallareddy key aide join in to BJP
టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అనుచరుడు, ఘట్ కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడైన ఏనుగు సుదర్శన్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, సుదర్శన్ రెడ్డితోపాటు ఘట్ కేసర్ మండలానికి చెందిన ఇతర నేతలు, వందలాది కార్యకర్తలు త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టు ఈటెల రాజేందర్ ప్రకటించారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వసూలైన వెంటనే చేరతామని చెప్పినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులంటే కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలే అనే విధంగా పరిస్థితిని కేసీఆర్ మార్చేశారని ఈటల విమర్శించారు. అధికార వికేంద్రీకరణ చేస్తామని, స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని పేరుకు చెబుతూ, వాస్తవంలో వాటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఏ మాత్రం అధికారాలు లేకుండా, నిధులు లేకుండా, కనీస గౌరవం లేకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అవమానాలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.