తమిళనాడు ఆర్థికమంత్రి కారుపైకి చెప్పు విసిరిన బీజేపీ కార్యకర్త

14-08-2022 Sun 06:37
  • జమ్మూకశ్మీర్‌లో అమరుడైన మధురై రైఫిల్‌మ్యాన్ లక్ష్మణ్
  • నివాళులు అర్పించేందుకు వెళ్లిన మంత్రి
  • అదే కార్యక్రమానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
  • ప్రొటోకాల్ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • మంత్రికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తల నినాదాలు
BJP supporter hurls slipper at Tamil Nadu minister Thiagarajans car
తమిళనాడు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ కారుపైకి బీజేపీ కార్యకర్త ఒకరు చెప్పు విసిరారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మధురైకి చెందిన రైఫిల్‌మ్యాన్ డి.లక్ష్మణ్ అమరుడయ్యారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు మంత్రి త్యాగరాజన్ వెళ్లారు. అదే కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై కూడా వస్తున్న విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, మిలటరీ ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఇతర అధికారులు మాత్రమే భాగం కావాలని, లేకపోతే ప్రొటోకాల్ ఉల్లంఘించినట్టు అవుతుందని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి ఆదేశాలతో అక్కడికొచ్చిన జనాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అదే సమయంలో బీజేపీ కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించాలని మంత్రి ఆదేశించినట్టు వార్త గుప్పుమంది. దీంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరుడు లక్ష్మణ్‌కు మంత్రి నివాళులు అర్పించి తిరిగి వెళ్తుండగా ఆయన వాహనంపైకి చెప్పు విసిరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఐదుగురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.