Anantapur: ఏటీఎంలో చోరీకి యత్నం.. ఫలించకపోవడంతో నిప్పు

Two miscreants set fire to ATM in Anantapur
  • అనంతపురంలో ఘటన
  • ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగు వ్యక్తులు
  • చోరీ యత్నం విఫలం కావడంతో ఓ ఏటీఎంకు నిప్పు
ఏటీఎంలో చోరీకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రయత్నం ఫలించకపోవడంతో దానికి నిప్పు పెట్టారు. అనంతపురంలో జరిగిందీ ఘటన. స్థానిక హెడ్‌ పోస్టాఫీసు వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రవేశించిన ఇద్దరు ముసుగు వ్యక్తులు అందులోని రెండు ఏటీఎంలను పగలగొట్టి చోరీకి యత్నించారు. అయితే, తమ ప్రయత్నం విఫలం కావడంతో నిరాశ చెందిన దుండగులు ఓ ఏటీఎం మెషీన్‌కు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న వ్యక్తి తగలబడుతున్న ఏటీఎంను చూసి పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏటీఎం సమీపంలోని దుకాణాల వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిప్పుపెట్టిన అనంతరం దుండగులు ఆర్ట్స్ కళాశాల వసతిగృహం వైపు వెళ్లినట్టు గుర్తించారు. అయితే, వారి ఆచూకీ మాత్రం లభించలేదు. నగదు చోరీకి గురైందా? లేదా? అన్న విషయాన్ని ఇప్పుడే నిర్ధారించలేమని బ్యాంకు అధికారులు తెలిపారు.
Anantapur
ATM
Fire
Andhra Pradesh
SBI

More Telugu News