పోలీసు తుపాకీతో గాల్లోకి కాల్పులను సమర్ధించుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

13-08-2022 Sat 16:30
  • తాను కాల్చింది ర‌బ్బ‌ర్ బుల్లెట్ అన్న శ్రీనివాస్ గౌడ్‌
  • తాను రైఫిల్ అసోసియేష‌న్ మెంబ‌ర్‌నని వెల్ల‌డి
  • త‌న‌కు ఎస్పీనే తుపాకీ ఇచ్చారన్న మంత్రి
  • స్పోర్ట్స్ మీట్స్‌లో ఇలా కాల్చ‌డం స‌హ‌జ‌మేన‌ని వివ‌ర‌ణ‌
ts minister srinivas goud comments on his firing incident
ఫ్రీడ‌మ్ ర్యాలీలో భాగంగా పోలీసుల చేతిలోని తుపాకీని తీసుకుని జ‌నం చూస్తుండ‌గానే గాల్లోకి కాల్పులు జ‌రిపిన తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థించుకున్నారు. భారీజ‌న సందోహం హాజ‌రైన ఈ కార్య‌క్ర‌మంలో పోలీసుల తుపాకీ తీసుకుని మంత్రి గాల్లోకి ఎలా కాల్పులు జ‌రుపుతారంటూ ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడిన మంత్రి.. ఇది స‌హ‌జ‌మేనంటూ వ్యాఖ్యానించారు.

తాను కాల్చింది ర‌బ్బ‌ర్ బుల్లెట్ అని పేర్కొన్న శ్రీనివాస్ గౌడ్‌... తాను రైఫిల్ అసోసియేష‌న్ స‌భ్యుడిన‌ని కూడా చెప్పారు. క్రీడా శాఖ మంత్రిగా త‌న‌కు ఇలా గాల్లోకి కాల్పులు జ‌రిపే అర్హ‌త ఉంద‌ని కూడా ఆయ‌న తెలిపారు. ర్యాలీలో తానేమీ పోలీసుల చేతిలోని తుపాకీని లాక్కోలేద‌ని చెప్పిన మంత్రి.. జిల్లా ఎస్పీనే త‌న‌కు స్వ‌యంగా తుపాకీ అందించార‌ని తెలిపారు. అయినా స్పోర్ట్స్ మీట్స్‌లో ఇలా కాల్చ‌డం స‌హ‌జ‌మేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.