3 ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును!... ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో కొత్త వాక్యాన్ని చేర్చిన కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి!

13-08-2022 Sat 15:21
  • కోమ‌టిరెడ్డిని హోం గార్డు అన్న రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోమ‌టిరెడ్డి
  • తాజా టీపీసీసీ చీఫ్ వ్యాఖ్య‌ల‌పై కోమ‌టిరెడ్డి వినూత్న నిర‌స‌న‌
komatireddy venkat reddy adds a new sentence on his twitter handle
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి త‌న‌పై చేసిన హోంగార్డు వ్యాఖ్య‌ల‌ను కాస్తంత సీరియ‌స్‌గానే తీసుకున్నారు. అవును... తాను కాంగ్రెస్ పార్టీకి హోం గార్డునేనంటూ ఆయ‌న తేల్చి చెప్పేశారు. ఈ మేర‌కు త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ కు... '3 ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డును' అన్న కొత్త వాక్యాన్ని కోమ‌టిరెడ్డి చేర్చారు. 

నిన్న‌టిదాకా కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి ట్విట్టర్ హ్యాండిల్‌లో పార్ల‌మెంటు స‌భ్యుడు, మాజీ కేబినెట్ మినిస్ట‌ర్‌, నాలుగు సార్లు ఎమ్మెల్యే అన్న వాక్యాలే ఉండేవి. తాజాగా ఈ వాక్యాల త‌ర్వాత '3 ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి హోం గార్డుగా ప‌నిచేస్తున్నాను' అంటూ ఆయ‌న ఓ వాక్యాన్ని చేర్చారు. రేవంత్ రెడ్డి త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా కోమ‌టిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను అప్‌డేట్ చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.