Salman Rushdie: రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ పై చికిత్స... ఓ కన్ను కోల్పోయే ప్రమాదం!

Salman Rushdie on ventilator
  • న్యూయార్క్ లో రష్దీపై దాడి
  • కత్తితో విరుచుకుపడిన యువకుడు
  • రష్మీదకి 15 కత్తిపోట్లు
  • మెడ, ఉదర భాగాల్లో తీవ్ర గాయాలు
  • ప్రస్తుతం మాట్లాడలేకపోతున్న రష్దీ
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై అమెరికాలోని న్యూయార్క్ లో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ సాహితీ సదస్సుకు హాజరైన రష్దీపై ఆగంతుకుడు కత్తితో విరుచుకుపడ్డాడు. 10 నుంచి 15 కత్తిపోట్లతో రష్దీ వేదికపైనే కుప్పకూలిపోయారు. మెడ, ఉదర భాగంలో తీవ్రగాయాలైన రష్దీని హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సల్మాన్ రష్దీ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. 

ఆయన ఓ కన్ను కోల్పోయే ముప్పు ఏర్పడిందని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు. కత్తిపోటు వల్ల కాలేయం కూడా దెబ్బతిన్నట్టు తెలిపారు. మోచేతి వద్ద నరాలు ఛిద్రం అయ్యాయని వైలీ వివరించారు. రష్దీ మాట్లాడలేకపోతున్నారని తెలిపారు. 

కాగా, రష్దీపై దాడికి పాల్పడిన వ్యక్తిని 24 ఏళ్ల హాదీ మతార్ గా గుర్తించారు. అతడు ఇరాన్ అనుకూల భావాలున్న వ్యక్తిగా భావిస్తున్నారు. సల్మాన్ రష్దీ భారత సంతతి రచయిత. ఆయన రచించిన ద శాటానిక్ వర్సెస్ నవల ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఛాందస వాదుల ఆగ్రహానికి గురైంది. రష్దీని చంపేయాలంటూ అప్పట్లో ఇరాన్ మహానేత ఆయతొల్లా ఖొమేనీ ఫత్వా కూడా జారీ చేశారు. 

రష్దీ భారతీయ అమెరికన్ మోడల్ పద్మాలక్ష్మిని నాలుగో వివాహం చేసుకున్నారు. ఆయనకు అంతకుముందే మూడు వివాహాలు జరిగాయి. పద్మాలక్ష్మితో రష్దీ వివాహం 2004లో జరగ్గా, మూడేళ్లకే విడిపోయారు.
Salman Rushdie
Ventilator
New York
USA

More Telugu News