ఫొటోలకు పోజిచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ‘గ్రేట్ ఖలీ’.. వీడియో వైరల్

13-08-2022 Sat 09:08
  • డబ్ల్యూడబ్ల్యూఈలో భారత్‌ను నిలబెట్టిన ఖలీ
  • ఫొటో, వీడియోగ్రాఫర్ల అభ్యర్థనపై ఫొటోలకు పోజిచ్చిన ఖలీ
  • ఆ వెంటనే భావోద్వేగంతో కన్నీరు
WWE Wrestler The Great Khali Cries While Posing For Paparazzi
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారత్‌ పేరును ప్రపంచవ్యాప్తం చేసిన ‘ది గ్రేట్ ఖలీ’ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన దలీప్ సింగ్ రానా డబ్ల్యూడబ్ల్యూఈతో ‘ది గ్రేట్ ఖలీ’గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. 

తాజాగా, ఆయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో నుంచి బయటకు వస్తున్న ఖలీని పోజు ఇవ్వాలంటూ వీడియో, ఫొటోగ్రాఫర్లు కోరారు. అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉండడంతో కాదనలేక ముందుకొచ్చి నవ్వుతూ పోజిచ్చారు.

ఆ వెంటనే భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీరు తుడుచుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. దీంతో ఫొటో, వీడియోగ్రాఫర్లతోపాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే, ఆయన ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారన్న విషయంలో స్పష్టత లేదు. వారు తనపై చూపించిన అభిమానానికి ఖలీ కన్నీళ్లు పెట్టుకున్నారా? లేదంటే అభిమానుల్లో ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా, ఖలీ పలు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు.