Raghu Rama Krishna Raju: విజయమ్మ కారు ప్రమాదం వెనుక కుట్ర ఉంది: ఎంపీ రఘురామ

Conspiracy was there behind YS Vijayamma car accident says Raghu Rama Krishna Raju
  • కారు ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకేసారి పేలిపోవడం అసంభవమన్న రఘురాజు 
  • ఈ ప్రమాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్య 
  • తనను పోలీసులు కొట్టిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని వెల్లడి 
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు నిన్న ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు పేలిపోయాయి. ఈ ఘటనపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. విజయమ్మ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారనే విషయం తెలిసి... ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశానని చెప్పారు. 

విజయమ్మ ప్రయాణించిన కారు కేవలం మూడున్నర వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగి ఉంటుందని... ట్యూబ్ లెస్ టైర్స్ రెండూ ఒకేసారి పేలిపోవడం అసంభవమని అన్నారు. ఈ ప్రమాదం నమ్మశక్యంగా లేదని చెప్పారు. తమ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ దుష్టచతుష్టయం అంటుంటారని... అందువల్ల ఈ ప్రమాదంపై విచారణ జరిపించాలని అన్నారు. దీని వెనుక కచ్చితంగా ఏదో కుట్ర ఉందని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి బాబాయ్ ని కోల్పోయారని, ఇప్పుడు ఇలా జరగడం బాధాకరంగా ఉందని అన్నారు. 

ఈరోజు సతీసమేతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రఘురాజు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం తనను తీసుకెళ్లి కొట్టిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల గురించి కూడా వివరించానని తెలిపారు.
Raghu Rama Krishna Raju
Jagan
YS Vijayamma
YSRCP
Car Accident
Droupadi Murmu

More Telugu News