'ఖుదీరామ్ బోస్' బయోపిక్ టైటిల్ ను లాంచ్ చేసిన వెంకయ్య నాయుడు

11-08-2022 Thu 21:55
  • విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో తెర‌కెక్కిన 'ఖుదీరామ్ బోస్'
  • ఈ చిత్రం ద్వారా నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ జాగర్లమూడి
  • షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైన చిత్రం
ex vice president venkaiah naidu releases Khudiram Bose title first look
ప్ర‌ముఖ‌ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఖుదీరామ్ బోస్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన‌ చిత్రం 'ఖుదీరామ్ బోస్' టైటిల్‌ ఫస్ట్ లుక్ ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గురువారం విడుద‌ల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో  పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. 

జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ పతాకంపై రాకేష్ జాగర్లమూడి, వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ నటీనటులుగా విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో కొత్త నిర్మాత విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాల‌ను వెల్ల‌డించింది. భారత స్వాతంత్య్ర‌ ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన ఖుదీరామ్ బోస్ మొదటి స్వాతంత్య్ర‌ సమర యోధుడిగానూ గుర్తింపు ద‌క్కించుకున్నార‌ని తెలిపింది. 1889లో జన్మించిన బోస్‌... ముజఫర్‌పూర్ కుట్ర కేసులో దోషిగా నిర్ధారించబడి 1908లో మరణశిక్షకు గుర‌య్యాడ‌ని వెల్ల‌డించింది. ఈ కేసు విచార‌ణ‌లో జ‌రిగిన కుట్ర‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలోనే ఈ చిత్రాన్ని రూపొందించిన‌ట్లు యూనిట్ తెలిపింది.