హైదరాబాద్ కోకాపేట్ లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్

11-08-2022 Thu 10:58
  • సోలార్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెచ్ ఎండీఏ
  • ప్రభుత్వం ఆమోదిస్తే.. ఓఆర్ఆర్ వెంబడి 21 కి.మీ. ఇదే నమూనాలో నిర్మాణం
  • ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం
solar roof cycle track is being developed at Kokapet
విదేశాల్లో మాత్రమే కనిపించే సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ తొందర్లో హైదరాబాద్ నగరంలోనూ అందుబాటులోకి రానున్నది. పైలట్ ప్రాతిపదికన కోకాపేట్‌లో దీన్ని అభివృద్ధి చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ ఎండీఏ) నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ పై ప్రతిపాదించిన 21 కిలోమీటర్ల సోలార్ సైక్లింగ్ ట్రాక్‌లో ఇది భాగం. ముందుగా కోకాపేట్ లో సైకిల్ ట్రాక్ ను అభివృద్ధి చేస్తామని హెడ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఓఆర్ఆర్ వెంబడి మొత్తం 21 కిలో మీటర్ల మేర ఇదే నమూనాను అవలంబిస్తామని చెప్పారు. 

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు వెంబడి సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం, సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటు తదితర పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలో మీటర్లు, నానక్‌రామ్‌గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలోమీటర్ల మేర ఈ ట్రాక్‌ సాగనుంది. సర్వీస్ రోడ్డు,  ఓఆర్ఆర్ ప్రధాన క్యారేజ్ వే  మధ్య ఈ ట్రాక్ ను అభివృద్ధి చేస్తారు. ఈ సోలార్ సైకిల్ ట్రాక్ సైక్లిస్టులకు ఎండ, వాన నుంచి రక్షణ అందిస్తుంది. అలాగే  ట్రాఫిక్ చిక్కులు లేకుండా సురక్షితంగా సైక్లింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 

అంతేకాదు ఈ సోలార్ ట్రాక్ వెంబడి ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు కూడా ఏర్పాటు చేయనున్నారు. 21 కి.మీ. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 9 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ విద్యుత్ ను ట్రాక్ లైటింగ్ తో పాటు ఓఆర్ఆర్ వెంబడి డ్రిప్ ఇరిగేషన్, వీధిలైట్ల కోసం వినియోగిస్తామని హెచ్ ఎండీఏ అధికారులు తెలిపారు. 

ఈ ప్రాజెక్ట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (ఆర్ఈ ఎస్ సీఓ) నమూనాను స్వీకరించారు. దీని ప్రకారం సౌర ఫలకాల కోసం మొత్తం ప్రారంభ మూలధన వ్యయాన్ని పెట్టుబడి పెట్టి, 25 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు. దీని ద్వారా లభించే విద్యుత్ ను తగ్గింపు ధరకు ప్రభుత్వం సంస్థలకు అందిస్తారు.