వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేయనున్న ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ

10-08-2022 Wed 18:39
  • వీడియో తొలుత ఏబీఎన్‌లోనే ప్ర‌సార‌మైంద‌న్న మాధ‌వ్‌
  • త‌న‌ను దుర్భాష‌లాడారంటున్న వేమూరి రాధాకృష్ణ‌
  • అందుకు గానూ మాధ‌వ్‌పై న్యాయ‌ప‌ర‌మైన చర్య‌ల‌కు సిద్ధ‌మైన‌ట్లు వెల్ల‌డి
abn md vemuri radhakrishna decides to file defamatikon suit against ysrcp mp gorantla madhav
ఓ మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడిన‌ట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు సంబంధించిన‌దిగా భావిస్తున్న వీడియో వ్య‌వ‌హారంలో బుధ‌వారం ప‌లు కీల‌క మ‌లుపులు చోటుచేసుకున్నాయి. ఈ వీడియో ఒరిజిన‌ల్ కాద‌ని అనంత‌పురం జిల్లా ఎస్పీ ఫ‌కీర‌ప్ప ఓ ప్ర‌క‌ట‌న చేయ‌గా... ఎస్పీ ప్ర‌క‌ట‌న‌ను ఎంపీ మాధ‌వ్ ఆహ్వానించ‌గా, టీడీపీ నేత‌లు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మ‌రోవైపు ఈ వీడియోను తొలుత ప్ర‌సారం చేసిన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛానెల్‌, దాని య‌జ‌మాని వేమూరి రాధాకృష్ణ‌పై ఇదివ‌ర‌కే ఎంపీ మాధ‌వ్ ఘాటు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. 

తాజాగా ఎంపీ మాధ‌వ్‌ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛాన‌ల్‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల య‌జ‌మాని వేమూరి రాధాకృష్ణ న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ వీడియో ప్ర‌సార‌మైన సంద‌ర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా త‌న‌ను ఎంపీ మాధ‌వ్ దుర్భాష‌లాడార‌ని రాధాకృష్ణ ఆరోపించారు. అందుకు గాను ఎంపీ మాధ‌వ్‌పై న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు రాధాకృష్ణ సిద్ధ‌మ‌య్యారు. ఎంపీ మాధ‌వ్‌పై రూ.10 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసేందుకు రాధాకృష్ణ నిర్ణ‌యించారు. అంతేకాకుండా ఎంపీపై క్రిమిన‌ల్‌, డిఫ‌మేష‌న్ చ‌ర్య‌ల‌కు కూడా రాధాకృష్ణ సిద్ధ‌మ‌య్యారు.