భాగ్య‌న‌గ‌రిలో త్రివ‌ర్ణంలోకి మారిపోయిన‌ ఫ్లై ఓవ‌ర్లు... వీడియో ఇదిగో

10-08-2022 Wed 18:24
  • దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు
  • ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట దేశ‌వ్యాప్తంగా వేడుక‌లు
  • తెలంగాణ‌లో స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట వేడుక‌లు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన త్రివ‌ర్ణ శోభిత ఫ్లై ఓవ‌ర్‌
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న నేప‌థ్యంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పేరిట కేంద్ర ప్ర‌భుత్వం భారీ కార్య‌క్ర‌మాల‌కు తెరదీసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ప్ర‌తి ఇంటిపై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇందుకోసం జాతీయ జెండాల త‌యారీ భారీ ఎత్తున కొన‌సాగుతోంది. అదే స‌మ‌యంలో దేశంలోని ప‌లు ప్రాంతాల్లో ఆయా నిర్మాణాల‌పై జాతీయ జెండాలు రెప‌రెప‌లాడుతుండ‌గా... ప్ర‌ధాన న‌గ‌రాల్లోని ప్ర‌ధాన నిర్మాణాల‌న్నీ త్రివ‌ర్ణమ‌యం అవుతున్నాయి.

ఇందులో భాగంగా తెలంగాణ‌ రాష్ట్ర ప్ర‌భుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహం పేరిట ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. 15 రోజుల పాటు సాగే ఈ కార్య‌క్ర‌మాల‌ను సీఎం కేసీఆర్ సోమ‌వారం లాంఛ‌నంగా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా రాజ‌ధాని హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన కూడ‌ళ్లు త్రివ‌ర్ణంలోకి మారిపోయాయి. న‌గ‌రంలోని ఫ్లై ఓవ‌ర్లు కూడా మువ్వ‌న్నెల రంగును అద్దుకున్నాయి. ఇలా త్రివ‌ర్ణంలోకి మారిపోయిన ఓ ఫ్లై ఓవ‌ర్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.