అప్పగింతల వరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే... బిగ్ బాస్ ప్రోమోలో నాగార్జున

10-08-2022 Wed 16:28
  • త్వరలో బిగ్ బాస్ సీజన్-6
  • మరోసారి హోస్ట్ గా నాగార్జున
  • ఆకట్టుకునేలా ప్రోమో
  • ఇంకా వెలువడని ప్రారంభ తేదీ
Bigg Boss season 6 promo out now
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించేందుకు బిగ్ బాస్ సీజన్-6 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో నాగ్ తనదైన రీతిలో సందడి చేశారు. ఇక ప్రోమో విషయానికొస్తే... ఓ పెళ్లికూతురు ఇంట అప్పగింతల సీన్ తో ప్రోమో ప్రారంభం అవుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు బిడ్డను కాపురానికి పంపుతూ కన్నీటిపర్యంతమవుతుంటారు. 

అంతలో పెళ్లికూతురు తల్లి ఫోన్ లో బిగ్ బాస్ షో చూస్తుంది. సీన్ కట్ చేస్తే అక్కడ పెళ్లికూతురు తప్ప మరెవ్వరూ కనిపించరు. ఇంతలో నాగార్జున ఎంట్రీ ఇచ్చి... అప్పగింతల వరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అంటూ వ్యాఖ్యానించడం ఈ ప్రోమోలో చూడొచ్చు. అయితే, బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది వెల్లడించలేదు. బహుశా తదుపరి ప్రోమోలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.