Sushil Modi: నితీశ్ కుమార్ ఒక కీలుబొమ్మే... రియల్ సీఎం తేజస్వి యాదవ్: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ

  • బీహార్ లో మారిన సమీకరణాలు
  • బీజేపీతో జేడీయూ తెగదెంపులు
  • ఆర్జేడీతో జట్టుకట్టిన నితీశ్ కుమార్
  • మరోసారి సీఎంగా సీనియర్ నేత
  • డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్
Bihar former Sushil Modi comments on JDU and RJD tie up

బీహార్ లో జేడీయూ నేత నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈసారి ఆర్జేడీ భాగస్వామ్యంతో ఆయన సీఎం పీఠం ఎక్కారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎం పదవిని అధిష్టించారు. ఈ పరిణామాలపై బీహార్ మాజీ సీఎం, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. బీహార్ లో ఇక చక్రం తిప్పేది తేజస్వి యాదవ్ నే అని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్ కేవలం ఒక కీలుబొమ్మ సీఎం అని, రియల్ సీఎం తేజస్వి యాదవ్ అని పేర్కొన్నారు.

ఆర్జేడీకి 80 మంది వరకు సభ్యుల బలం ఉందని, వీళ్లకు (జేడీయూ) తిప్పికొడితే 45-46 సీట్లు కూడా ఉండవని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఎలాంటివాడో అందరికీ తెలిసిందేనని, నితీశ్ కుమార్ ను ఉత్సవ విగ్రహంలా ఉంచి, ముఖ్యమంత్రి అధికారాలను తేజస్వి యాదవ్ చలాయిస్తాడని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. 

గతంలో బీజేపీతో భాగస్వామ్యంలో ఉన్నప్పుడు లభించిన గౌరవం ఇప్పుడు ఆర్జేడీ నుంచి నితీశ్ కుమార్ కు లభించకపోవచ్చని అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి (బీజేపీ) అధిక స్థానాలు ఉన్నప్పటికీ తాము నితీశ్ కుమార్ ను సీఎంను చేశామని, ఆయన పార్టీని ఎన్నడూ చీల్చాలని ప్రయత్నించలేదని సుశీల్ మోదీ స్పష్టం చేశారు. 

"మాకు నమ్మకద్రోహం చేసే వారినే మేం చీల్చేందుకు ప్రయత్నిస్తాం. మహారాష్ట్రలో మాకు శివసేన అలాంటి ద్రోహమే చేసింది... పర్యవసానాలు అనుభవించింది" అని వ్యాఖ్యానించారు.

More Telugu News