మీ పెట్టుబడుల్లో ఎంత బంగారం ఉండొచ్చు..?

10-08-2022 Wed 12:40 | Business
  • ప్రతి ఒక్కరి పెట్టుబడులలో బంగారానికి చోటు ఉండాలంటున్న నిపుణులు
  • 10-15 శాతం మధ్య కేటాయించుకోవచ్చని సూచన
  • పెట్టుబడుల్లో వైవిధ్యం, రిస్క్ తగ్గించుకునే సాధనం
How much gold you should hold in your portfolio
ఆర్జించే ప్రతీ వ్యక్తికి ఆర్థిక ప్రణాళిక ఉండాల్సిందే. లేదంటే వస్తున్న రూపాయి ఎందుకు ఖర్చవుతుందో, ఎటు వెళుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో పొదుపు చేయలేక అత్యవసరాల్లో అప్పులపాలు అయ్యే పరిస్థితి తెచ్చుకోకూడదు. ప్రతి ఒక్కరూ తమ ఆర్జనలో కొంత మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లించాల్సిందే. ఎంత చెట్టుకు అంత గాలి అనే మాదిరే పొదుపు, మదుపులు ఉండాలి.

ఇక సంపాదనలో ఆదా చేసిన దానిని బ్యాంకు ఖాతాలో ఉంచుకుంటే, అది వృద్ధి చెందదు. సరికదా, ద్రవ్యోల్బణం కారణంగా కొన్నేళ్లకు దాని వాస్తవ విలువ తగ్గిపోతుంది. అందుకని ఆదా చేసుకున్న మొత్తాన్ని మంచి రాబడి కోసం పెట్టుబడిగా పెట్టుకోవాలి. అప్పుడే జీవితంలో ఎన్నో లక్ష్యాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. 

వైవిధ్యం..
మంచి రాబడి కోసం ఈక్విటీలు ఒక మార్గం. ఇంకా రియల్ ఎస్టేట్, బంగారం, ఫిక్స్ డ్ డిపాజిట్లు తదితర సాధనాలు ఉన్నాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలంలో అధిక రాబడి ఆశించొచ్చు. అదే సమయంలో అస్థిరతలు, రిస్క్ పాళ్లు ఎక్కువ. అందుకని పెట్టుబడులను వైవిధ్యం చేసుకునేందుకు కొంత మొత్తాన్ని బంగారానికి కేటాయించుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది ఫిక్స్ డ్ డిపాజిట్లు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్, షేర్లకు పరిమితం అవుతుంటారు. బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూడరు. కానీ, పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా చోటు ఇవ్వాల్సిందేనన్నది నిపుణుల సూచన.

ఎంత మొత్తం..?
బంగారంపై ఎంత పెట్టుబడి పెట్టుకోవచ్చు? అన్న సందేహం వస్తుంది. తమ మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో మెరుగైన రాబడికితోడు, పెట్టుబడుల్లో ఇతర విభాగాల నుంచి వచ్చే కుదుపులను తట్టుకునేందుకు సపోర్ట్ గా ఉంటుంది. 

పెట్టుబడి మార్గాలు..
బంగారానికి ఇంత శాతం కేటాయించాలని నిర్ణయించుకున్న అనంతరం ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న సందేహం రావచ్చు. ఆర్బీఐ జారీ చేసే సార్వభౌమ బంగారం బాండ్లు అత్యంత అనుకూలం. 8 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఈ సాధనంలో ఏటా 2.5 శాతం వడ్డీగా చెల్లిస్తారు. కాల వ్యవధి తర్వాత బంగారం మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు చేస్తారు.

స్టాక్ మార్కెట్లో షేర్ల మాదిరి ట్రేడ్ అయ్యే గోల్డ్ ఈటీఎఫ్ లలోనూ పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఒకే విడత కాకుండా క్రమానుగతంగా కొనుగోలు చేసుకోవడం సరైనది. పెట్టుబడి కోసమే అయితే ఈ రెండు మెరుగైన సాధనాలు. ఆభరణాలు, పెట్టుబడి కలసిన కోణం అయితే భౌతిక బంగారం రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు.