Punjab: పంద్రాగస్టున సిక్కుల జెండా ఎగురవేయాలంటూ పంజాబ్​లో చిచ్చురేపిన అకాలీదళ్ ఎంపీ

Hoist Sikh flag not tricolour on August 15 says Akali Dal MP Simranjit Singh Mann
  • హర్ ఘర్ తిరంగాను బహిష్కరించాలని పిలుపునిచ్చిన సిమ్రన్ జిత్ సింగ్ మాన్ 
  • జాతీయ జెండాలను కాల్చేయాలన్న మరో వేర్పాటువాద నేత పన్నూన్
  • పన్నూన్ ను దేశం నుంచి బహిష్కరించాలంటున్న బీజేపీ 
75వ స్వాంతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని శిరోమణి అకాలీదళ్ ఎంపీ సిమ్రన్ జిత్ సింగ్ మాన్ పంజాబ్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాకుండా పంద్రాగస్టున జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు పంజాబ్ లో తీవ్ర దుమారం రేపాయి. 

మరో అడుగుముందుకేసి భారత దళాలను ‘శత్రువు’ శక్తులుగా పేర్కొన్నారు. ఖలిస్థాన్ ఉగ్రవాది అయిన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ఆ శత్రు శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందాడని వ్యాఖ్యానించారు. మరో వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో పంజాబ్ ప్రజలు త్రివర్ణ పతాకాన్ని కాల్చేసి, ఖలిస్థానీ జెండాలను ఎగురవేసేలా ప్రేరేపించారు. 

బీజేపీతో పాటు పంజాబ్ అధికార ఆప్ పార్టీ.. మాన్, పన్నూన్‌ వ్యాఖ్యలను ఖండించాయి. ‘హర్ ఘర్ తిరంగా’ బహిష్కరించాలనడం అకాలీదళ్ నిజ స్వభావాన్ని బయటపెడుతుందని ఆప్ అధికార ప్రతినిధి మల్వీందర్ సింగ్ కాంగ్ అన్నారు. ‘స్వాతంత్ర్యం కోసం వేలాది పంజాబీలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. కాబట్టి మాన్ కు ఎవ్వరూ ప్రాముఖ్యత ఇవ్వకూడదు. జాతీయ జెండా పట్ల మాకు ఎల్లప్పుడూ అమితమైన గౌరవం ఉంది’ అని మల్విందర్ అన్నారు. 

పంజాబ్ బీజేపీ నాయకుడు వినీత్ జోషి కూడా గురు పత్వంత్ సింగ్ పన్నూన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఖలిస్థాన్‌ను తిరస్కరించారని, ఎంతో కష్టపడి సంపాదించిన శాంతి విలువను అర్థం చేసుకున్నారని అన్నారు. ‘గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఐఎస్‌ఐ చెప్పినట్టు చేస్తూ దేశంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎలాంటి పిలుపు ఇచ్చినా ప్రజల నుంచి స్పందన రాలేదు. ఎన్నో కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న పన్నూన్ ను దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని వినీత్ జోషి డిమాండ్ చేశారు.
Punjab
national flag
Akali Dal
Simranjit Singh Mann
MP
BJP
AAP

More Telugu News