Taiwan: తైవాన్ రక్షణ అధికారి అనుమానాస్పద మృతి

Top Taiwan defence official found dead amid tensions with China
  • క్షిపణుల తయారీ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న యాంగ్ లీషింగ్
  • దక్షిణ తైవాన్ హెంచ్ చెంగ్ పట్టణంలోని హోటల్ గదిలో మృతి
  • చైనా యుద్ధ విన్యాసాలు చేస్తున్న తరుణంలో జరిగిన ఘటన 
తైవాన్ రక్షణ శాఖలో కీలక అధికారి ఒకరు అనుమానాస్పదంగా మరణించడం సంచలనం కలిగిస్తోంది. తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని పరిశోధన అభివృద్ధి విభాగం హెడ్ గా  పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్ లో మరణించినట్టు గుర్తించారు. దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. యాంగ్ లీషింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టడం గమనార్హం. పలు క్షిపణుల తయారీ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షిస్తుంటారు. 

పింగ్ టంగ్ కంట్రీలోని హెంగ్ చన్ లో ఓ హోటల్ గదిలో యాంగ్ లీషింగ్ అచేతనంగా ఉండడాన్ని గుర్తించినట్టు నేషనల్ చంగ్ షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటన విడుదల చేసింది. మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్, యాంజీనా పెక్టోరిస్ వల్ల మరణించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైనట్టు తెలిపింది. 

అయితే, యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పెలోసీ తైవాన్ లో పర్యటించి వెళ్లిన వెంటనే చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే. తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తోంది. ఈ తరుణంలో యాంగ్ లీషింగ్ మరణించడమే అనుమానాలకు తావిస్తోంది.
Taiwan
defence official
dead
China

More Telugu News