KTR: సిరిసిల్ల చేనేత కార్మికుడి ప్రతిభకు కేటీఆర్ ఫిదా

Minister KTR compliments Siricilla Handloom artist Hari Prasad
  • నేతన్నకు బీమా పథకం గురించి పట్టు నేత వేసిన కార్మికుడు
  • ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్
  • తెలంగాణలోని  చేనేత,  పవర్-లూమ్ నేత కార్మికులు నిజమైన కళాకారులు అని కొనియాడిన మంత్రి
సిరిసిల్లకు చెందిన ఓ చేనేత కార్మికుడి ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ‘నేతన్నకు బీమా’ పథకం గురించి ఆ వ్యక్తి చేసిన అందమైన పట్టు నేతను ప్రశంసించారు. రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం తీసుకొచ్చింది.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్న బీమా పథకం’ను ప్రారంభిస్తారు. 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హులు. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందించనున్నారు. రాష్ట్రంలోని 80 వేల నేత కార్మికులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరనుంది. 

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సిరిసిల్లకు చెందిన వెల్దె హరిప్రసాద్.. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు పథకం వివరాలను తెలుపుతూ పట్టు నేత వేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.  ‘తెలంగాణలోని చేనేత, పవర్-లూమ్ నేత కార్మికులు నిజమైన కళాకారులు. ఈ అందమైన పట్టు నేత ద్వారా నేతన్నకు బీమా పథకం పట్ల సిరిసిల్లకు చెందిన వెల్దె హరిప్రసాద్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే అన్నీ పూర్తయ్యాయి. హరిప్రసాద్ గారూ నా అభినందనలు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR
Telangana
hamdloom
siricilla
nethannaku bheema

More Telugu News