మూవీ రివ్యూ: 'బింబిసార'

  • ఈ రోజునే విడుదలైన 'బింబిసార'
  • రెండు కాలాల్లో నడిచే కథ 
  • మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన కల్యాణ్ రామ్
  • ప్రధాన బలంగా స్క్రీన్ ప్లే .. బీజీఎమ్ .. ఫొటోగ్రఫీ .. వీఎఫ్ ఎక్స్ 
  • ప్రాధాన్యత లేని నాయికల పాత్రలు
  • ఎక్కడా తడబడని దర్శకుడు
  • కల్యాణ్ రామ్ కి హిట్ పడినట్టే
Bimbisara Movie Review

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన 'బింబిసార' సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో ఆయన ఈ సినిమాను కొత్త దర్శకుడితో చేశాడు. పైగా ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథ. కాలంలో ప్రయాణం చేసే కథ. కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించే కథ. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ సినిమాను. ఒక కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయగలడా? అనుకున్నారు. చాలా కాలంగా కల్యాణ్ రామ్ ఎదురుచూస్తున్న సరైన హిట్టు ఈ సినిమాతోనైనా పడుతుందా? అనే ఆసక్తి అందరిలోను ఉంది. కానీ ఈ సారి ఆడియన్స్ ను నిరాశపరచనని కల్యాణ్ రామ్ చెబుతూ వచ్చాడు. ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడేమో ఇప్పుడు చూద్దాం. 

క్రీస్తు పూర్వం .. 'త్రిగర్తల సామ్రాజ్యం'లో ఈ కథ మొదలవుతుంది. ఆ సామ్రాజ్యానికి 'బింబిసారుడు' ( కల్యాణ్ రామ్) చక్రవర్తి. మానవత్వమనేది ఆయన కనుచూపుమేరలో కనిపించదు. మంచిమాట అనేది ఆయన దరిదాపుల్లో వినిపించదు. ఆ సామ్రాజ్యంలోని ప్రజలందరికీ ఆయనంటే భయం. తన సైనిక బలంతో శత్రు రాజ్యాలను ఆక్రమిస్తూ వెళుతుంటాడు. అలా కొల్లగొట్టబడిన సంపదలను ఒక గుహలో భద్రపరుస్తాడు. ఆ సమయంలోనే ఆయుర్వేద ఆశ్రమాన్ని నడుపుతున్న ఒక సిద్ధ వైద్యుడు (తనికెళ్ల భరణి) బింబిసారుడి శత్రువుకి వైద్యం చేసి ఆయన ఆగ్రహానికి కారకుడవుతాడు. 

ఆ వైద్యుడితో పాటు ఆశ్రమంలోని పాపను చంపడానికి కూడా బింబిసారుడు వెనుకాడడు. ఆ వైద్యుడి దగ్గర లభించిన 'ధన్వంతరి గ్రంథం'లో 'వ్యాధులు ..  ఔషధ రహస్యాలు' ఉంటాయి. ఆ గ్రంథాన్ని కూడా నిధి గుహలోనే బింబిసారుడు భద్రపరుస్తాడు. ఆయన హస్తముద్ర  .. ఆయన కంఠధ్వని ద్వారా మాత్రమే నిధి కలిగిన ఆ గుహ తలుపులు తెరవడం సాధ్యమవుతుంది. ఆ నిధి తాలూకు రహస్యం ఆయన సన్నిహితుడు జుబేదా ( శ్రీనివాసరెడ్డి)కి మాత్రమే తెలుసు. బింబిసారుడికి దేవదత్తుడు (కల్యాణ్ రామ్) అనే కవల సోదరుడు ఉంటాడు. తన అధికారానికి అడ్డుతగులుతాడేమోనని దేవదత్తుడిని చంపడానికి బింబిసారుడు ప్రయత్నిస్తాడు. 

బింబిసారుడి బారి నుంచి తప్పించుకున్న దేవదత్తుడికి ఒక 'మాయా దర్పణం' లభిస్తుంది. ఆ దర్పణం ద్వారా భవిష్యత్తులోకి వెళ్లొచ్చు .. తిరిగి రావొచ్చు. దేవదత్తుడు ఒక ప్రథకం ప్రకారం ఆ మాయా దర్పణాన్ని బింబిసారుడి మందిరానికి చేరుస్తాడు. ఆ తరువాత రహస్యంగా ఆ మందిరంలోకి దేవదత్తుడు ప్రవేశిస్తాడు. చనిపోయాడనుకున్న దేవదత్తుడు తిరిగిరావడం చూసి బింబిసారుడు ఆశ్చర్యపోతాడు. అక్కడే దేవదత్తుడిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలోనే మాయా దర్పణంలోకి నెట్టివేయబడిన బింబిసారుడు .. ప్రస్తుత కాలంలోని హైదరాబాద్ కి వచ్చేస్తాడు. 

అయితే గతంలో బింబిసారుడు దాచిన నిధి గురించి .. ఆ గుహలోని 'ధన్వంతరి గ్రంథం' గురించి 'కేతు' అనే మాంత్రికుడి  (అయ్యప్ప శర్మ) ద్వారా తెలుసుకున్న ప్రతినాయకుడు, ఆ గుహ తలుపులు తెరవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ సమయంలోనే బింబిసారుడు ఈ కాలంలోకి వచ్చిన విషయం మాంత్రికుడి ద్వారా ప్రతినాయకుడికి తెలుస్తుంది. అక్కడేమో బింబిసారుడి స్థానంలో ఆయన సోదరుడు ఆ సామ్రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇక్కడేమో అసలు బింబిసారుడు విలన్ పరిధిలోకి వచ్చేస్తాడు. ఆ తరువాత చోటు చేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

వశిష్ఠకి దర్శకుడిగా పెద్ద అనుభవం లేకపోయినా .. ఆయనను నమ్మి ఇంత మొత్తాన్ని కల్యాణ్ రామ్ ఎలా ఖర్చు చేశాడు? అనుకున్నవారు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. బలమైన కథాకథనాలతో .. తక్కువ సంఖ్యలో కలిగిన ప్రధానమైన పాత్రలతో .. అద్భుతమైన వీఎఫ్ ఎక్స్ తో ఆయన ఈ కథను ఎక్కడా తడబడకుండా .. సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది .. కాలాలు మారిపోతుంటాయి. కానీ ఆడియన్స్ ఎక్కడా కన్ఫ్యూజ్ కానీ స్క్రీన్ ప్లే తో రక్తి కట్టించాడు. కల్యాణ్ రామ్ ను మూడు డిఫరెంట్ లుక్స్ తో కొత్తగా చూపించాడు.

మొదటి నుంచి చివరివరకూ కథ పట్టు తగ్గదు. కాకపోతే ఇద్దరు కథానాయికలను పెట్టుకుని .. వాళ్ల పాత్రలను సరిగ్గా డిజైన్ చేసుకోలేదు. గ్లామర్ పరంగా వాళ్ల నుంచి ఆశించిన అవుట్ పుట్ శూన్యం. ఇక ప్రస్తుత కాలంలో నడిచే సంయుక్త మీనన్ పాత్ర పరిస్థితి మరింత దారుణం. కథా పరంగా ఇద్దరినీ ఉపయోగించుకునే అవకాశం ఉండి కూడా వదిలేశారు. 

అలా అని చెప్పేసి ఆడియన్స్ లో అసహనం ఉండదు .. మిగతా కథ ఉత్కంఠభరితంగా నడుస్తూనే ఉంటుంది. కల్యాణ్ రామ్ తన పాత్రలకు న్యాయం చేశాడు ..  వేరియేషన్స్ చూపించాడు. కాకపోతే ఆయన హెయిర్ స్టైల్ విషయంలో మరికాస్త శ్రద్ధ పెట్టవలసింది. ప్రకాశ్ రాజ్ .. శ్రీనివాస రెడ్డి .. విలన్ పాత్రధారి .. అయ్యప్ప శర్మ ఎవరి పరిధిలో వాళ్లు మెప్పించారు. 

ఇక ఈ సినిమా పాటల పరంగా ఫరవాలేదు. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి .. సినిమాకి ప్రధానమైన బలం అదే. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై 'బాహుబలి' మార్క్ కనిపిస్తూ ఉంటుంది. 'గులేబకావళి' పువ్వులాంటి యవ్వనం' అనే పాటలో మాత్రం సాహిత్యం అర్థం కాదు .. మ్యూజిక్ డామినేట్ చేసింది. అంతేకాదు .. 'బింబిసారుడి' కాలంలో సాగే ఈ స్పెషల్ సాంగ్ ఇప్పటి ఐటమ్ లా ట్యూన్ చేశారు .. అదే విధంగా కొరియోగ్రఫీ చేశారు. బింబిసారుడి కాలానికి సంబంధించింది అతకని అంశం ఏదైనా ఉందంటే .. అది ఈ ఐటమ్ సాంగ్ అనే చెప్పాలి. 

ఇక వాసుదేవ్ సంభాషణలు గుర్తుపెట్టుకునే స్థాయిలో లేవు. కామాలు .. ఫుల్ స్టాప్ లు లేని సుదీర్ఘమైన డైలాగులు అక్కడక్కడా ఇబ్బంది పెడతాయి. ఇక ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది చోటా కె నాయుడి కెమెరా పనితనం. రెండు కాలాల్లో నడిచే ఈ కథను తెరపై ఆయన అందంగా .. అద్భుతంగా ఆవిష్కరించాడు. తమ్మిరాజు ఎడిటింగ్ కి వంకబెట్టవలసిన పనిలేదు. చందమామ కథలా ప్రేక్షకులకు తేలికగా అర్థమయ్యేలా ఆయన తన పనితనం చూపించాడు.

ఇక ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ కూడా గొప్పగా ఉంది. చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే, కథాకథనాల పరంగా .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా.. ఫొటోగ్రఫీ పరంగా .. గ్రాఫిక్స్ పరంగా .. సెట్స్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులను ఈ సారి నిరాశపరచనని చెప్పిన కల్యాణ్ రామ్, ఆ మాటను నిలబెట్టుకున్నాడనే ఒప్పుకోవాలి.

--- పెద్దింటి గోపీకృష్ణ

More Telugu News