Brain: మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ నాలుగు ఆహార పదార్థాలు తీసుకోవాలంటున్న నిపుణులు

  • అన్ని అవయవాల తరహాలోనే మెదడుకు ప్రత్యేక పోషకాలు కావాలంటున్న నిపుణులు
  • నైట్రేట్లు, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉన్న ఆహారంతో ప్రయోజనమని వెల్లడి
  • బీట్ రూట్, బ్రకోలి, ఆకుల తరహాలోని కూరగాయలు, క్యారెట్లు తీసుకోవాలని సూచన
Four vegetables to keep your brain young and healthy

మన శరీరం ఆరోగ్యంగా ఉండటం అంటే అన్ని అవయవాలు బాగా పనిచేయాలి. దానితోపాటు మన మెదడు కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి. శరీరంలోని ఒక్కో అవయవం పనిచేయడానికి దానికంటూ కొన్నిరకాల ప్రత్యేక పోషకాలు అదనంగా అవసరమవుతాయి. అదే తరహాలో మెదడుకు కూడా కొన్ని రకాల ప్రత్యేక విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఇతర పోషకాలు ఎక్కువగా కావాలి. అవి సరిగా అందినప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 

ఇందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలు తోడ్పడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నైట్రేట్లు, ఫోలిక్ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందని వివరిస్తున్నారు. ప్రధానంగా నాలుగు ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

1. బీట్ రూట్
బీట్ రూట్, దానికి సంబంధించిన కూరగాయల్లో నైట్రేట్లు, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయని.. అవి మెదడు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరగాయల్లోని నైట్రేట్లు మెదడులోని కీలక ప్రాంతాల్లో రక్త ప్రసరణను పెంచడానికి తోడ్పడతాయని వివరిస్తున్నారు. ఇక మెదడుకు సంబంధించిన వ్యాధులైన డిమెన్షియా (మతిమరుపు), అల్జీమర్స్ వంటివి దరిచేరకుండా ఫోలిక్ యాసిడ్ (విటమిన్ బీ9) తోడ్పడుతుందని చెబుతున్నారు.

2. బ్రకోలి, కాలీఫ్లవర్
క్రూసిఫెరస్ వెజిటబుల్స్ గా పిలిచే బ్రకోలి, కాలీఫ్లవర్ వంటివి మెదడు ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచడంతోపాటు జ్ఞాపక శక్తి మెరుగుపడేందుకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.

3. ఆకుల తరహాలోని కూరగాయలు
   పాలకూర, లెట్యూస్, కేల్, పలు రకాల ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ కె వంటివి ఎక్కువగా ఉంటాయని.. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణులు వివరిస్తున్నారు. శరీరంలో ఫ్రీర్యాడికల్స్ తో యాంటీ ఆక్సిడెంట్లు పోరాడుతాయని.. ఫ్రీ ర్యాడికల్స్ మెదడులోని కణాలను దెబ్బతీయకుండా అడ్డుకుని రక్షిస్తాయని చెబుతున్నారు.

4. క్యారెట్లు
క్యారెట్లతోపాటు నారింజ రంగులో ఉండే కంద గడ్డ, ఎరుపు క్యాప్సికం వంటి ఇతర కూరగాయల్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ ర్యాడికల్స్ ను బీటా కెరోటిన్ అడ్డుకుని, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని స్పష్టం చేస్తున్నారు. క్యారెట్లలోని ఇతర పోషకాలు జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయని వివరిస్తున్నారు.

కేవలం ఈ నాలుగే సరిపోవు
మెదడు ఆరోగ్యంగా ఉండటానికి కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడంతోనే సరిపోదని.. మంచి నిద్ర, మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండటం వంటివీ అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల మెదడు, జ్ఞాపకశక్తి, ఇతర మానసిక అంశాలకు సంబంధించిన ఇబ్బందులు, సమస్యలు ఏవైనా ఉంటే.. వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

More Telugu News