'బింబిసార' టైమ్ ట్రావెల్ మూవీ... తప్పకుండా కొత్త అనుభూతిని అందిస్తుంది: దర్శకుడు వశిష్ట

  • కల్యాణ్ రామ్ హీరోగా బింబిసార
  • వశిష్ట దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం
  • మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన వశిష్ట
  • 'బింబిసార'ను మగధీర, బాహుబలితో పోల్చుతున్నారని వెల్లడి
Bimbisara director Vasishta opines on his debut venture

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ జానర్ లో వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ట ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఓ మీడియాకు సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. 

విడుదల కాకముందే 'బింబిసార' చిత్రాన్ని మగధీర, బాహుబలి చిత్రాలతో పోల్చుతున్నారని, తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. అయితే, 'బింబిసార' కూడా ఆ రెండు చిత్రాల్లా ఉంటుందా అని అడుగుతున్నారని, కానీ, ఆ రెండు చిత్రాలకు 'బింబిసార' కథా నేపథ్యానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ చిత్రంలో ఒక రాజు మరో కాలం నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడని, ఇది తప్పకుండా కొత్త అనుభూతిని అందిస్తుందని వశిష్ట వివరించారు. మగధీర, బాహుబలి సోషియా ఫాంటసీ చిత్రాలని, తమది టైమ్ ట్రావెల్ మూవీ అని తెలిపారు. 

ఇక, చరిత్ర నుంచి తాము తీసుకున్నది కేవలం 'బింబిసారుడు' అనే పేరు మాత్రమేనని, ఆనాటి బింబిసారుడికి సంబంధించిన విషయాలేవీ ఇందులో ఉండవని, 'బింబిసార'లో తాము చూపించబోయేది అంతా కాల్పనిక గాథ అని స్పష్టం చేశారు. చరిత్రలో రావణాసురుడు, బకాసురుడు, కీచకుడు ఎంతో దుష్టులుగా పేరుగాంచారని, వారిని మించిన క్రూరుడు తమ బింబిసారుడు అని, అతడు మంచి వైపు ఎలా అడుగులు వేశాడో చూపించామని వశిష్ట వెల్లడించారు.

More Telugu News