Bollywood: ఆ భయంతోనే ఇప్పటిదాకా హిందీ సినిమాలను ఒప్పుకోలేదు: నాగచైతన్య

Naga Chaitanya rejected Bollywood films as he was insecure about his Hindi
  • తన హిందీపై అభద్రతా భావంతోనే నిరాకరించానని వెల్లడించిన చైతన్య
  • దక్షిణాది పాత్ర కావడంతో ‘లాల్ సింగ్ చడ్డా’ ఓకే చెప్పానని వెల్లడి 
  • ఈ నెల 11వ తేదీన విడుదల అవుతున్న చిత్రం
ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ సినమాతో అక్కినేని నాగచైతన్య బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఆగస్ట్ 11న విడుదలయ్యే ఈ చిత్రంలో బాలరాజు పాత్రలో చైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తెలుగులో తెరంగేట్రం చేసిన దశాబ్దం తర్వాత ఆయన ఓ హిందీ చిత్రం చేస్తున్నాడు. 

అయితే, గతంలో పలుమార్లు హిందీ అవకాశాలు వచ్చినా తిరస్కరిస్తూ  వచ్చానని చైతన్య చెప్పాడు. ఇందుకు కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నేను చెన్నైలో పుట్టి పెరిగి, హైదరాబాద్ వచ్చా. దాంతో, నేను హిందీ అంత బాగా మాట్లాడలేను. ఆ భయంతోనే కొన్నాళ్లుగా హిందీ ఆఫర్లు వస్తున్నా తిరస్కరించా. నా హిందీ దక్షిణాది యాసలో ఉంటుందని చెబితే నాకు ఆఫర్ చేసిన వాళ్లు కూడా పునరాలోచనలో పడేవారు’ అని చైతన్య చెప్పాడు. 

‘లాల్ సింగ్ చడ్డా’కు ఓకే చెప్పడానికి భాషా అవరోధం తొలగడమే కారణమని చెప్పాడు. ‘నాకు లాల్ సింగ్ చడ్డా ఆఫర్ వచ్చినప్పుడు కూడా నా హిందీ సమస్య గురించి చెప్పా. దీనికి ఆమిర్ సర్ ఒప్పుకున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలో నేను ఉత్తరాదికి వెళ్లే దక్షిణ భారత అబ్బాయిగా నటిస్తున్నా. అక్కడి నుంచే మా ప్రయాణం ప్రారంభమవుతుంది. చిత్రంలో నేను సౌత్ ఇండియన్‌గా ఉండాలి. అలానే మాట్లాడాలి. కాబట్టి చిత్రంలో నేను హిందీ మాట్లాడినప్పుడు ఒకటి రెండు తెలుగు పదాలు దొర్లినా, ఆ యాస వచ్చినా చిత్ర బృందం ఫర్వాలేదని చెప్పేది. నిజానికి నా పాత్రకు తెలుగు ఫ్లేవర్ తెచ్చేందుకు మేము అక్కడక్కడ కొన్ని తెలుగు పదాలను చేర్చాము’ అని చైతన్య చెప్పుకొచ్చాడు.
Bollywood
Tollywood
Naga Chaitanya
Aamir Khan
debut

More Telugu News