మహీంద్రా స్కార్పియో-ఎన్ వాహనాలకు మతిపోయేంతగా డిమాండ్... 30 నిమిషాల్లో లక్ష బుకింగులు
- మహీంద్రా నుంచి స్పార్పియో-ఎన్
- బుకింగ్ లు ప్రారంభం
- నిమిషంలో 25 వేల బుకింగ్ లు
- సెప్టెంబరు 26 నుంచి వాహనాల డెలివరీ
మొత్తం మీద 30 నిమిషాల్లోనే లక్ష బుకింగ్ లతో మహీంద్రా స్కార్పియో-ఎన్ అదరగొట్టింది. ఈ క్రమంలో ఈ బ్రాండ్ న్యూ వాహనం ఓవరాల్ గా రూ.18,000 కోట్లు రాబట్టింది. ఓ కొత్త మోడల్ వాహనానికి, కనీసం వాహన డెలివరీలు ప్రారంభం కాకముందే ఈ స్థాయిలో బుకింగ్ లు రావడం మార్కెట్ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
స్కార్పియో-ఎన్ వాహనాలను సెప్టెంబరు 26 నుంచి కస్టమర్లకు అందించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 20 వేల యూనిట్లు అందించాలన్నది తమ ప్రణాళిక అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
పెట్రోల్ వెర్షన్ లో స్పార్పియో-ఎన్, దాని వేరియంట్లు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల వరకు ధర (ఎక్స్ షోరూం) పలుకుతున్నాయి. డీజిల్ వెర్షన్లో స్పార్పియో-ఎన్, దాని వేరియంట్లు రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల వరకు ధర (ఎక్స్ షోరూం) పలుకుతున్నాయి. తొలి 25 వేల యూనిట్లకు 'ప్రారంభ' ధరలు వర్తిస్తాయని, ఆ తర్వాత అమ్ముడయ్యే వాహనాలకు సవరించిన ధరలు వర్తింపజేస్తామని మహీంద్రా సంస్థ పేర్కొంది.
కాగా, ఇప్పుడు బుకింగ్ చేసుకున్న అందరికీ వాహనాలు అందించాలంటే మహీంద్రా సంస్థకు మరో రెండేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది. పాత లోగో కాకుండా స్పార్పియో-ఎన్ వాహనాలను మహీంద్రా సంస్థ తమ కొత్త లోగోతో తీసుకువస్తోంది.

