Skin: చర్మం నిగారింపు కోసం.. నాలుగు పూటలా నాలుగు రకాల ఆహార పదార్థాలు!

  • నాలుగు పూటలా నాలుగు రకాల వెరైటీలతో ఎంతో ప్రయోజనం
  • బెర్రీ, సిట్రస్ జాతి పండ్లు, డ్రైఫ్రూట్స్ తో తగిన పోషకాలు అందే వీలు
  • గుడ్లు, బ్రకొలి, క్యాబేజీ వంటివాటితోనూ చర్మ ఆరోగ్యానికి లాభమంటున్న నిపుణులు
For glowing skin four types of food in four meals

మన శరీరంలో జీవ క్రియలు సరిగా కొనసాగడానికి తగిన పోషకాలు అవసరం. ముఖ్యంగా కొన్ని రకాల అవయవాల పనితీరు కోసం ప్రత్యేకమైన విటమిన్లు, అమైనో ఆమ్లాలు వంటివి అందాల్సిందే. ముఖ్యంగా చర్మం ఆరోగ్యంగా ఉండి, మంచి నిగారింపు సంతరించుకోవాలంటే.. విటమిన్లు అత్యంత ఆవశ్యకం. కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఆయా విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. చర్మ సంరక్షణ కంపెనీలు కూడా.. ఆయా పండ్లు, వృక్షాల భాగాలను తమ ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నట్టు ప్రకటనలు కూడా ఇస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలో చర్మం ఆరోగ్యం, నిగారింపు కోసం తోడ్పడే ఆహార పదార్థాలేమిటనే దానితోపాటు ఏయే సమయాల్లో ఏయే పదార్థాలు తీసుకోవచ్చనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

పొద్దున బ్రేక్ ఫాస్ట్ లో..   

  • రోజూ మనం తీసుకునే ఆహారంలో ఉదయాన్నే చేసే బ్రేక్ ఫాస్ట్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన, నిగారింపుతో కూడిన చర్మం కోసం పొద్దున్నే మంచి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో విటమిన్లతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో విష పదార్థాలను తొలగించి శుభ్రపరుస్తాయి. పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్, పెరుగు, తృణ ధాన్యాలతో కూడిన ఆహారంలో బెర్రీలను జత చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • అవకాడోల్లో విటమిన్లతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. విటమిన్లను శరీరం సరైన విధంగా శోషించుకునేందుకు ఈ కొవ్వు పదార్థాలు తోడ్పడుతాయి. ఇది చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు వీలు కల్పిస్తుంది.

మధ్యాహ్నం భోజనంలో..   
  • ఉదయం నుంచే పనిలో పడిన శరీరానికి తగిన శక్తిని ఇచ్చేలా, ఆ శక్తిని శరీరం తగిన విధంగా వినియోగించుకునేందుకు వీలు కల్పించే పోషకాలు ఉండేలా మధ్యాహ్న భోజనం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను చేర్చడం వల్ల అటు శక్తితోపాటు ఇటు పోషకాలు అందుతూ సంపూర్ణ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుడ్లను బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తింటుంటారు. అలా తీసుకోని వారు మధ్యాహ్నం తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుందని అంటున్నారు.
  • పాలకూర, క్యాబేజీ, బ్రకొలి, లెట్యూస్ వంటి కూరగాయల్లో అత్యవసర విటమిన్లు ఉంటాయి. వాటిలో నీటి శాతం కూడా ఎక్కువే. వీటిని మధ్యాహ్న భోజనంలో చేర్చితే.. చర్మం నిగారింపు సంతరించుకుంటుందని.. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

సాయంత్రం స్నాక్స్ గా..   
  • సాధారణంగా స్నాక్స్ తినడం ఆరోగ్యకరం కాదన్న భావన ఉంది. స్నాక్స్ గా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఆరోగ్యకరం కాదన్న ప్రసక్తే ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరీరానికి రోజంతా తగిన పోషకాలు అందడం మంచి చర్మ సౌందర్యానికి తోడ్పడుతుందని అంటున్నారు.
  • డ్రైఫ్రూట్స్, ఇతర గింజలు చాలా అద్భుతమైన స్నాక్స్ గా వినియోగించవచ్చని.. వీటితో మొత్తం శరీరానికి ఆరోగ్యం చేకూరడంతోపాటు చర్మ నిగారింపునకు సంబంధించి ఎంతో ప్రయోజనం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ వంటి స్నాక్స్ కు బదులు బాదం, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా, గుమ్మడి గింజలు, ఇతర డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
  • నిమ్మ, నారింజ, బత్తాయి వంటి సిట్రస్ జాతి పండ్లు చర్మ నిగారింపునకు ఎంతో తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిని సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవడం వల్ల శరీరానికి తగిన విధంగా ద్రవాలు అందడంతోపాటు చర్మానికి నిగారింపు ఇచ్చే విటమిన్ సి కూడా సమృద్ధిగా అందుతుందని వివరిస్తున్నారు.

రాత్రిపూట భోజనం (డిన్నర్ లో)..   
  • రోజులో చివరిగా రాత్రిపూట తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలకమని.. శరీరానికి విశ్రాంతి ఇవ్వడంతోపాటు బలాన్నీ ఇచ్చేలా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అదికూడా తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
  • పెప్పర్స్ (మిరపకాయలు)లో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. మిగతా విటమిన్లూ ఉంటాయి. వాస్తవానికి ఎర్ర మిరపకాయల్లో నారింజ పండ్లకన్నా ఎక్కువ విటమిన్ సీ ఉంటుందని.. అయితే కారం కారణంగా వాటి వినియోగం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని రాత్రి వంటలో తగిన స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు.
  • టమాటాలలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ మన చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తుందని.. అదనంగా విటమిన్లు ఉంటాయని చెబుతున్నారు. టమాటాల్లోని పోషకాలు మెలనిన్ ఉత్పత్తికి సాయపడతాయని.. అది చర్మం ఆరోగ్యానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రోజూ నాలుగు పూటలు ఆహారంలో భిన్నమైన పోషకాలు అందేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నా.. ప్రతి ఒక్కరూ వారివారి శరీర పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, ఊబకాయం సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకు వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఈ పోషకాలేవీ చెడు చేయకున్నా.. మనం తీసుకునే ఇతర ఆహారం కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు.

More Telugu News