Pawan Kalyan: క్రేన్ ప్రమాద ఘటన మానవ తప్పిదమా? యాంత్రిక లోపమా? అనేది తెలంగాణ ప్రభుత్వం పరిశీలించాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts to crane accident
  • పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం
  • క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికుల దుర్మరణం
  • ఈ ఘటన ఆవేదన కలిగించిందన్న పవన్
  • బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కార్మికులు క్రేన్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన ఆవేదన కలిగించిందని అన్నారు. 

క్రేన్ సాయంతో కార్మికులు పంప్ హౌస్ లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగిపడి కార్మికులు పంప్ హౌస్ లోకి పడిపోవడం మానవ తప్పిదమా? లేక, యాంత్రిక లోపమా? అనేది ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

ఉపాధి కోసం బయటికి వెళ్లినవారు శాశ్వతంగా తిరిగిరాకపోతే ఆ కుటుంబం అనుభవించే క్షోభను ఊహించలేమని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మృతుల పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు రానీయకుండా అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నానని తెలిపారు.
Pawan Kalyan
Crane Accident
Palamuru-Rangareddy Project
Labour
Deaths
Telangana

More Telugu News