Vanpic Case: జగన్ అక్రమాస్తుల కేసు: వాన్‌పిక్ సంస్థపై కేసును కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

Jagan Disproportionate Asset Case TS High Court Dismissed Vanpic Case
  • జగన్ అక్రమాస్తుల కేసులో తమపై నమోదైన కేసును కొట్టేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన వాన్‌పిక్
  • విచారణ చేపట్టిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం
  • సీబీఐ కోర్టు యాంత్రికంగా వ్యవహరించిందన్న హైకోర్టు  
  • నిమ్మగడ్డ ప్రసాద్ సహా 13 మందిపై కొనసాగనున్న విచారణ
జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాన్‌పిక్ సంస్థకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అయితే, ఆ సంస్థ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ సహా మరో 13 మందిపై మాత్రం విచారణ కొనసాగనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో వాన్‌పిక్‌పై నమోదైన నేరాలకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేసింది. 

ఈ మేరకు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్నప్పుడు సీబీఐ కోర్టు యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తప్పుబట్టింది. సరైన సమాచారం లేకుండా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే న్యాయం జరిగినట్టు కాదని తేల్చి చెప్పింది.

జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తులో భాగంగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో 2012లో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వాన్‌పిక్‌కు సంబంధించిన కేసులో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏ 10 గా చేర్చింది. దీంతో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ 2021లో వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ సందర్భంగా నేర విచారణ ప్రక్రియ గురించి సీఆర్‌పీసీలోని అంశాలతోపాటు వాటిపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను కోర్టు ప్రస్తావించింది. సీపీఆర్‌సీని సమర్థంగా అమలుచేయడానికి, కోర్టు ప్రక్రియను దుర్వినియోగపరచకుండా అడ్డుకోవడానికి, అంతిమంగా న్యాయాన్ని పరిరక్షించేందుకు  సీపీఆర్‌సీలోని సెక్షన్ 482ను వినియోగించి కేసును కొట్టేయవచ్చని స్పష్టం చేసింది. 

కాగా, వాన్‌పిక్ కేసును కోర్టు కొట్టేసినప్పటికీ ఆ సంస్థ చైర్మన్ నిమ్మగడ్డ సహా మరో 13 మందిపై మాత్రం విచారణ కొనసాగనుంది. ఈ కేసులో మూడో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్‌పై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది.
Vanpic Case
Nimmagadda Prasad
Telangana High Court
Disproportionate Assets Case
Jagan

More Telugu News