'రాష్ట్రపత్ని' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌధురి.. నిప్పులు చెరుగుతున్న బీజేపీ!
- ముర్ముకు సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలన్న స్మృతి ఇరానీ
- రాజ్యాంగ పదవుల్లో మహిళలను కించ పరిచేందుకు సోనియా అవకాశం ఇచ్చారని మండిపాటు
- రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ముర్మును టార్గెట్ చేస్తున్నారని విమర్శ
దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టిన మహిళను కించపరిచేందుకు కూడా తన పార్టీ నేతలకు సోనియాగాంధీ అవకాశం ఇచ్చారని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ... ఆదివాసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి అని మండిపడ్డారు. సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న మహిళలను కించపరచడం కొనసాగుతూనే ఉందని అన్నారు. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ పార్లమెంటులోనే కాకుండా దేశంలోని వీధుల్లో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటి నుంచి ఆమెను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందని స్మృతి ఇరానీ అన్నారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఆమెపై దాడి ఆగలేదని మండిపడ్డారు.