HCL: దేశంలో అత్యంత ధనికురాలు రోష్ని నాడార్​.. మహిళా ధనవంతుల జాబితా విడుదల చేసిన హరూన్​

  • సొంతంగా ఎదిగిన ధనికురాలిగా నిలిచిన నైకా అధిపతి ఫల్గుణి నాయర్
  • ఉమ్మడిగా జాబితా విడుదల చేసిన కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్–హరూన్ సంస్థలు
  • కనీసం రూ.300 కోట్లపైన ఆస్తి ఉన్న వారికి జాబితాలో చోటు
Roshni Nadar richest indian woman in hurun list

హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సంస్థ చైర్ పర్సన్ రోష్ని నాడార్ ఇండియాలో అత్యంత ధనిక మహిళగా నిలిచినట్టు కోటక్ ప్రైవేట్ బ్యాంకింగ్–హరూన్ జాబితా తేల్చింది. ఆమె 2021 చివరి నాటికి ఏకంగా రూ.84,330 కోట్ల సంపదతో టాప్ లో నిలిచారని.. అంతకుముందటి ఏడాదితో పోలిస్తే ఆమె సంపద 54 శాతం పెరిగిందని తెలిపింది. 40 ఏళ్ల వయసులోనే రోష్ని నాడార్ ఈ స్థాయికి చేరడం గమనార్హం.

రెండో స్థానంలో ఫల్గుణి నాయర్
కుటుంబం నుంచి కాకుండా సొంతంగా సంస్థను స్థాపించి ధనికురాలిగా ఎదిగిన మహిళల్లో నైకా బ్యూటీ బ్రాండ్ వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ టాప్ లో నిలిచారు. 59 ఏళ్ల వయసున్న ఆమె సంపద రూ.57,520 కోట్లు అని.. ఏడాదిలో సంపద 963 శాతం పెరిగిందని హరూన్ సంస్థ తెలిపింది. మొత్తంగా దేశంలో రెండో అత్యంత ధనికురాలు ఫల్గుణి నాయర్ అని వెల్లడించింది.

మూడో స్థానంలో కిరణ్ మంజుందార్ షా
బయోకాన్ సంస్థకు చెందిన కిరణ్ మంజుందార్ షా రూ.29,030 కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. అయితే ఆమె సంపద 21 శాతం తగ్గిపోయిందని.. అంతకుముందు రెండో ప్లేస్ లో ఉన్న ఆమె.. మూడో స్థానానికి పడిపోయారని హరూన్ సంస్థ తెలిపింది.

మొత్తం 100 మందితో..

  • దేశంలో వివిధ వ్యాపార సంస్థలను స్థాపించిన లేదా నిర్వహిస్తున్న టాప్–100 మహిళలు, వారి ఆస్తులతో హరూన్ సంస్థ తాజాగా జాబితాను ప్రకటించింది. ఇందులో కనీసం రూ.300 కోట్ల ఆస్తిపైన ఉన్న వారికి చోటు లభించినట్టు వివరించింది.
  • ఈ మొత్తం 100 మంది మహిళల ఆస్తి సగటున 53 శాతం పెరిగిందని తెలిపింది. 2020లో రూ.2.72 లక్షల కోట్లుగా ఉన్న వీరి ఆస్తి.. 2021 నాటికి రూ.4.16 లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించింది.
  • మొత్తం 100 అత్యంత ధనిక మహిళల్లో అత్యధికంగా ఢిల్లీ (ఎన్సీఆర్ పరిధి) నుంచి 25 మంది ఉన్నారు. తర్వాత 21 మందితో ముంబై రెండో స్థానంలో, 12 మందితో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.
  • రంగాల వారీగా చూస్తే అత్యధికంగా.. ఫార్మాకు చెందినవారు 12 మంది, వైద్యారోగ్య రంగానికి చెందినవారు 11 మంది, నిత్యావసర సరుకుల వ్యాపారానికి చెందిన 9 మందికి హరూన్ జాబితాలో చోటు లభించింది. 

More Telugu News