సైబ‌ర్ క్రైమ్ పోలీస్ స్టేష‌న్‌లో నితిన్ సినిమా డైరెక్ట‌ర్‌... త‌న‌పై త‌ప్పుడు ప్రచారం జ‌రుగుతోంద‌ని ఫిర్యాదు

  • కొన్ని కులాల‌ను కించ‌ప‌రిచేలా గ‌తంలో పోస్టులు పెట్టార‌ని ద‌ర్శ‌కుడిపై పోస్టులు
  • బ్యాన్ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అంటూ పోస్టులు
  • మాచ‌ర్ల ముచ్చ‌ట్లు పేరిట సోష‌ల్ మీడియాలో ప్రచారం
  • నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన రాజ‌శేఖ‌ర్‌
Director MS Rajasekhar Reddy Files a Case with Cyber Crime

టాలీవుడ్ హీరో నితిన్ న‌టిస్తున్న మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమాకు ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎంఎస్ రాజ‌శేఖర్ రెడ్డి బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌నపై సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని, దానికి కార‌కులైన వారిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు త‌న ఫిర్యాదుతో పాటు తాను క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. 

ఈ వివాదం వివ‌రాల్లోకెళితే... ఏపీలోని ప‌ల్నాడు జిల్లా ప‌రిధిలోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరిట రాజ‌శేఖ‌ర్ రెడ్డి సినిమాను ప్లాన్ చేయ‌గా... ఈ సినిమాలో నితిన్ హీరోగా న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా... సినిమా ఆగ‌స్టు 12న‌ విడుద‌ల కానుంది. ఇలాంటి క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ రెడ్డి గ‌తంలో కొన్ని సామాజిక వ‌ర్గాల‌ను కించ‌ప‌రిచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని జాగ్ర‌త్త‌గా ఉండాలంటూ స్వ‌యంగా నితిన్ పేరిట సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ప్ర‌త్య‌క్ష‌మైంది. దీనిని ఫేక్ పోస్ట్‌గా రాజ‌శేఖ‌ర్ రెడ్డి కొట్టి పారేశారు.

అంత‌టితో ఆ వివాదం ముగియ‌క‌పోగా... మాచ‌ర్ల ముచ్చ‌ట్లు పేరిట ఓపెన్ అయిన ఓ ఖాతాలో రాజ‌శేఖర్ రెడ్డిని ఇబ్బందుల‌కు గురి చేసేలా వీడియోలు, పోస్ట్‌లు వ‌రుస‌గా ప్ర‌త్య‌క్ష‌మయ్యాయి. దీంతో రాజ‌శేఖర్ రెడ్డి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌నపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారానికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ ఆయ‌న పోలీసుల‌ను కోరారు.

More Telugu News