india: మరో మెగా క్రికెట్​ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న భారత్​

India to host Womens ODI World Cup in 2025
  •  2025 మహిళల వన్డే ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు సొంతం చేసుకున్న బీసీసీఐ
  • భారత్ లో ఈ టోర్నీ జరగడం ఇది నాలుగోసారి
  • ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీలోకి లక్ష్మణ్‌ 
భారత్ మరో మెగా క్రికెట్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో జరిగే మహిళల వన్డే  ప్రపంచ కప్‌నకు ఆతిథ్యం హక్కులు భారత్ దక్కించుకుంది. ఈ మేరకు బర్మింగ్‌హామ్‌లో మంగళవారం ముగిసిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్‌లో బీసీసీఐ ఈ టోర్నీ ఆతిథ్య హక్కుల బిడ్ గెలిచింది. దాంతో, దశాబ్దం విరామం తర్వాత భారత్ లో మహిళల వన్డే వరల్డ్ కప్ జరగనుంది. చివరగా 2013లో ఈ టోర్నీకి మన దేశం ఆతిథ్యం ఇచ్చింది. అంతకుముందు 1978, 1997లో కూడా భారత్ లోనే ఈ టోర్నీ జరిగింది.
  
 ఇక, 2024, 2026 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లను వరుసగా బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌కు కేటాయిస్తున్నట్టు వార్షిక కాన్ఫరెన్స్ లో ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే, 2027లో జరిగే తొలి మహిళల టీ20 చాంపియన్స్‌ ట్రోఫీ హక్కులను శ్రీలంకకు కేటాయించింది. వీటితో పాటు 2023–2027 కాలానికి సంబంధించి పురుషుల, మహిళల ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎఫ్‌టీపీ)కు ఐసీసీ బోర్డు ఆమోదం తెలిపింది. 

భారత క్రికెట్ లెజెండ్‌, ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఐసీసీ మెన్స్‌ క్రికెట్‌ కమిటీలోకి తీసుకుంది. అలాగే, ఐసీసీ నూతన చైర్మన్‌ ఎన్నికను ఈ నవంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. కొలంబియా, ఐవరీకోస్ట్‌, ఉజ్బెకిస్తాన్‌ ఐసీసీ నూతన అసోసియేట్‌ మెంబర్స్‌గా ఎంపికయ్యాయి.
india
BCCI
womens
odi world cup
2025
hosting rights

More Telugu News