టీడీపీ ఎంపీల‌తో వైసీపీ ఎంపీ లావు... ఆస‌క్తి రేకెత్తించిన ఫొటో ఇదిగో

26-07-2022 Tue 19:43
  • ఢిల్లీలోని కేశినేని నాని ఇంటిలో స‌మావేశం
  • టీడీపీ ఎంపీ ఇంటికెళ్లిన‌ వైసీపీ ఎంపీ లావు
  • డీఎంకే, ఎన్సీపీ, శివ‌సేన ఎంపీలు కూడా హాజ‌రు
  • అంతా క‌లిసి కేశినేని నాని ఇంటికెళ్లామ‌ని డీఎంకే ఎంపీ క‌థిర్ ఆనంద్ వెల్ల‌డి
ysrcp mp Sri Krishna Devarayulu Lavu photo with tdp mps
ఏపీలో అధికార పార్టీ వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఓ రేంజిలో జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇరు పార్టీల మ‌ధ్య వివాదంతో త‌న‌కేమీ సంబంధం లేద‌న్న రీతిలో వైసీపీ యువ నేత‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు మంగ‌ళ‌వారం టీడీపీ ఎంపీల‌తో క‌లిసి క‌నిపించారు. అంతేకాకుండా టీడీపీతో పాటు మ‌రికొన్ని పార్టీల ఎంపీల‌తో క‌లిసి ఆయ‌న నేరుగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి చెందిన ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అక్క‌డ టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు కేశినేని, గ‌ల్లా జ‌య‌దేవ్‌, కింజ‌రాపు రామ్ మోహ‌న్ నాయుడులతో కలిసి గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. 
అయితే ఈ ఫొటోలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, వైసీపీ ఎంపీ లావుల‌తో పాటు డీఎంకేకు చెందిన ఎంపీలు క‌నిమొళి, త‌మిజాచ్చి తంగ‌పాండియ‌న్‌, క‌థిర్ ఆనంద్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన ఎంపీ ధైర్య‌శీల్ మానే త‌దిత‌రులు కూడా ఉన్నారు. తామంతా క‌లిసి కేశినేని నాని ఇంటికి వెళ్లిన‌ట్లు పేర్కొన్న‌ డీఎంకే ఎంపీ కథిర్ ఆనంద్ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.