Monkeypox Virus: మంకీ పాక్స్ వైరస్ విస్తరణను ఆపొచ్చు.. కానీ సమయం మించిపోతోంది: డబ్ల్యూహెచ్వో నిపుణులు

Monkeypox outbreak can be stopped says WHO official
  • వైరస్ విస్తరిస్తున్న చోట సరైన వ్యూహాలను అమలు చేస్తే నియంత్రించవచ్చని వెల్లడి
  • అందుకోసం ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని సూచన
  • డబ్ల్యూహెచ్ వో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా ఇంకా చర్చలే జరుగుతున్నాయని వివరణ
ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ భయాందోళనలు రేపుతున్న మంకీ పాక్స్ వైరస్ విస్తరణను ఆపగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) టెక్నికల్ విభాగం నిపుణుడు రోసమండ్ లుయిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంకీ పాక్స్ విస్తరిస్తున్న చోట్ల సరైన వ్యూహాలను అమలు చేస్తే ఆ వైరస్ పై విజయం సాధించవచ్చని.. అందుకు సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. కానీ ఆ దిశగా చర్యలు లేక సమయం మించిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి అయినా..
మంకీ పాక్స్ వైరస్ విస్తృతిని ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా డబ్ల్యూహెచ్ వో ఇటీవలే ప్రకటించింది. ఈ మేరకు అత్యంత అప్రమత్తత అలర్ట్ ను కూడా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య సమన్వయానికి, మంకీ పాక్స్ ను అడ్డుకునే చర్యలకు అవసరమైన నిధుల సమీకరణకు, వ్యాక్సిన్లు, చికిత్సల అభివృద్ధి, పంపిణీపై దృష్టి సారించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రోసమండ్ లూయిస్ మాట్లాడారు. ‘‘మంకీ పాక్స్ వైరస్ నిర్మూలనకు సంబంధించి ప్రపంచ స్థాయిలో సమన్వయం కోసం డబ్ల్యూహెచ్ వో కృషి చేస్తోంది. అయితే ఇది ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది..” అని వెల్లడించారు.

75 దేశాలు.. 16 వేల కేసులు
ఆఫ్రికాలో మొదలైన మంకీ పాక్స్ వైరస్ ప్రస్తుతం 75 దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు అధికారికంగా 16 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని రోసమండ్ లూయిస్ పేర్కొన్నారు. ఇక ఇప్పటివరకు మంకీ పాక్స్ తో ఐదుగురు చనిపోయినట్టు లెక్కలు ఉన్నాయి. ఈ ఐదు మరణాలూ ఆఫ్రికాలోనే నమోదయ్యాయి.
Monkeypox Virus
Outbreak
WHO
International

More Telugu News