వైఎస్ ష‌ర్మిల సీఎం కావ‌డం ఖాయం: డి. శ్రీనివాస్‌

  • డీఎస్‌ను ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల‌
  • వైఎస్సార్ సీఎం అవుతార‌ని తాను ముందే చెప్పాన‌న్న డీఎస్‌
  • వైఎస్సార్ బిడ్డ‌గా ష‌ర్మిల కూడా సీఎం అవుతుంద‌న్న మాజీ మంత్రి
d srinivas says ys sharmila becomes cm

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల భ‌విష్య‌త్తుపై తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త ధ‌ర్మ‌పురి శ్రీనివాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల డీఎస్ అనారోగ్యానికి గురి కాగా... సోమ‌వారం ఆయ‌న‌ను ష‌ర్మిల పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల సీఎం కావ‌డం ఖాయ‌మంటూ ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కూడా సీఎం అవుతార‌ని తాను 2003లో చెప్పాన‌ని... అందుక‌నుణంగానే 2004లో వైఎస్ సీఎంగా ప‌ద‌వి చేప‌ట్టార‌ని ఆయ‌న చెప్పారు. భ‌విష్య‌త్తులో వైఎస్ బిడ్డ ష‌ర్మిల కూడా సీఎం అవుతుంద‌ని డీఎస్ చెప్పుకొచ్చారు. 

వైఎస్ రాజ‌శేఖ‌రరెడ్డి బ‌తికి ఉండ‌గా... వైఎస్‌, డీఎస్ క‌లిసి ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ సీఎల్పీ నేత‌గా ఉండ‌గా... డీఎస్ పీసీసీ చీఫ్‌గా వ్య‌వ‌హ‌రించారు. వీరిద్ద‌రి ఉమ్మ‌డి నాయ‌క‌త్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజయం సాధించింది.  ఆ త‌ర్వాత వైఎస్ సీఎం కాగా... డీఎస్ ఆయ‌న కేబినెట్‌లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు. ఈ కాంబినేష‌న్‌లోనే కాంగ్రెస్ పార్టీ 2009లో మ‌రోమారు విక్ట‌రీ కొట్టింది.  

More Telugu News