Gotabaya Rajapaksa: సింగపూర్ లో గొటబాయపై 63 పేజీల భారీ ఫిర్యాదు

  • శ్రీలంకలో సంక్షోభ జ్వాలలు
  • దేశం విడిచి పారిపోయిన గొటబాయ రాజపక్స
  • తొలుత మాల్దీవులకు, అక్కడ్నించి సింగపూర్ చేరిక
  • గొటబాయపై క్రిమినల్ నేరారోపణలు చేసిన ఐటీజేపీ
ITJP complains against Gotabaya in Singapore

తీవ్ర సంక్షోభంతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ఉంటే ప్రాణాలకు హాని తప్పదని భయపడి విదేశాలకు పారిపోయిన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు అక్కడా మనశ్శాంతి ఉండడంలేదు. తొలుత మాల్దీవులకు పరారైన గొటబాయ, అక్కడ నిరసనలు ఎదురవడంతో సింగపూర్ వెళ్లిపోయారు. ఇప్పుడు సింగపూర్ లోనూ ఆయనకు చిక్కులు తప్పలేదు. 

దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నేషనల్ ట్రూత్ అండ్ జస్టిస్ ప్రాజెక్ట్ (ఐటీజేపీ) అనే పౌర హక్కుల సంఘం ఆయనపై సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేసింది. 2009లో శ్రీలంకలో అంతర్యుద్ధం చోటుచేసుకున్న సమయంలో గొటబాయ రక్షణ మంత్రిగా ఉన్నారని, తీవ్రస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఆ సంఘం సింగపూర్ అటార్నీ జనరల్ కు 63 పేజీల భారీ ఫిర్యాదును సమర్పించింది.  

అంతర్యుద్ధం వేళ హత్యలు, ఉరితీతలు, అత్యాచారాలు, నిర్బంధాలు, మానసిక వేధింపులు, దాడులు వంటి హేయమైన చర్యలు జరిగాయని వివరించింది. ఇవన్నీ జెనీవా ఒప్పందాలకు విరుద్ధమని, గొటబాయ అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలను అతిక్రమించారని ఐటీజేపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యోస్మిన్ సూకా వివరించారు. 

అంతేకాదు, గొటబాయ సైన్యంలో కమాండర్ గా ఉన్న సమయంలో 700 మంది ఆచూకీ లేకుండా పోయారని, రక్షణ మంత్రి అయ్యాక నేరాలు మరింత పెరిగాయని ఐటీజేపీ తన ఫిర్యాదులో వెల్లడించింది. అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి ప్రజలపై దాడులకు పురిగొల్పేవారని పేర్కొంది. శ్రీలంకలో ఏర్పడిన సంక్షోభం ఇలాంటి అనేక అంశాలతో ముడిపడి ఉందని, ఇవన్నీ తీవ్రమైన అంతర్జాతీయ నేరాలు అని ఐటీజేపీ స్పష్టం చేసింది. అందుకే గొటబాయను అరెస్ట్ చేయాలని, నేరాలపై దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.

More Telugu News