కరోనా పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మంకీపాక్స్ కు కూడా అవే జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

24-07-2022 Sun 22:27
  • దేశంలో మంకీపాక్స్ కలకలం
  • ఇప్పటిదాకా నాలుగు పాజిటివ్ కేసులు
  • ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్
  • ఇతర జబ్బులు ఉన్నవారికి ప్రాణాంతకమంటున్న వైద్యులు
Monkeypox measures same as covid
కరోనా పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని భావించేంతలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. భారత్ లో ఇప్పటికే 4 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో 34 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. 

కరోనా వైరస్ పట్ల తీసుకున్న జాగ్రత్తలు తీసుకుంటే మంకీపాక్స్ ను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. భౌతికదూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా జాగ్రత్తలు మంకీపాక్స్ నివారణలోనూ వర్తిస్తాయని పేర్కొన్నారు. ఏవైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలని సూచించారు. 

విదేశీ ప్రయాణాలు చేసిన వారు దీని బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారి పట్ల మంకీపాక్స్ ప్రాణాంతకం అయ్యే అవకాశముందని డాక్టర్ సురేశ్ కుమార్ వివరించారు. దీన్ని 99 శాతం నయం చేయవచ్చని తెలిపారు.