Pyramid: పిరమిడ్‌ ధ్యానాన్ని బోధించిన గురువు సుభాష్‌ పత్రిజీ కన్నుమూత

Pyramid meditation guru subhash patriji passed away
  • కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పత్రిజీ
  • పరిస్థితి సీరియస్ గా మారడంతో ఆదివారం సాయంత్రం మృతి
  • సోమవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామని పిరమిడ్ ధ్యాన ట్రస్టు ప్రకటన
  • తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లో అతిపెద్ద ధ్యాన పిరమిడ్ ఏర్పాటు చేసిన పత్రిజీ
తెలుగు రాష్ట్రాల్లో పిరమిడ్ ధ్యాన మార్గాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్ ఆప్ ఇండియా వ్యవస్థాపకులు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం సాయంత్రం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా మూత్ర పిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఇటీవలే రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి తరలించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పిరమిడ్ ధ్యాన ట్రస్టు సభ్యులు ప్రకటించారు. పిరమిడ్‌ ధ్యాన మండలి సభ్యులంతా తరలి రావాలని కోరారు.

అతి పెద్ద ధ్యాన పిరమిడ్ తో..
నిజామాబాద్ జిల్లా బోధన్‌ ప్రాంతానికి చెందిన పత్రిజీ కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. పిరమిడ్ ధ్యానాన్ని బోధించి పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో ప్రపంచంలోనే పెద్దదైన మహా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. అందులో ఏటా డిసెంబర్ లో ప్రపంచ ధ్యాన మహాసభలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గతంలో ధ్యానం ముసుగులో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుభాష్ పత్రిజీపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో జరిగిన పలు పరిణామాలు కూడా వివాదాస్పదంగా మారాయి.

సుభాష్ పత్రిజీ కన్నుమూయడంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ మరణం బాధాకరం, పిరమిడ్ కేంద్రం ద్వారా అనేక రకాల ధ్యానం ప్రచారంలో విశేషంగా వారు చేసిన సేవలు గుర్తించదగినవి. వారి మరణం పట్ల నా సంతాపం, వారి భక్తులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను.” అని ట్వీట్ చేశారు.

Pyramid
Pyramid meditation
subhash patriji
patriji

More Telugu News