Srisailam Project: నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. కాసేపట్లో క్రస్ట్ గేట్లను ఎత్తనున్న మంత్రి అంబటి రాంబాబు!

  • 882.50 అడుగులకు చేరుకున్న జలాశయం నీటిమట్టం
  • ప్రాజెక్టులోకి వస్తున్న 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
Srisailam reservoir filled with flood water

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. వేలాది క్యూసెక్కుల వరద నీరు చేరుకుంటుండటంతో... శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 81,853 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా... 57,751 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 882.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.0439 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమవైపు ఉన్న ఏపీ, తెలంగాణ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 

మరోవైపు జలాశయం నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకోవడంతో... క్రస్ట్ గేట్లను ఎత్తేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఇప్పటికే శ్రీశైలంకు చేరుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మరోవైపు, ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు కూడా అక్కడకు చేరుకుంటున్నారు.

More Telugu News