ప్ర‌జా జీవితంలో ఏడాది పూర్తి!... ఐపీఎస్‌కు వీడ్కోలును గుర్తు చేసుకున్న ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్!

19-07-2022 Tue 15:27
  • గ‌తేడాది జులై 19న ఐపీఎస్‌ను వ‌దిలిన ఆర్ఎస్ ప్ర‌వీణ్
  • ఆపై బీఎస్పీలో చేరి తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఎదిగిన వైనం
  • ఐపీఎస్‌కు రాజీనామా చేసిన లేఖ‌ను పంచుకున్న బీఎస్పీ నేత‌
r s praveen kumar rmembers his retirement to police service
ఖాకీ వ‌దిలి ఖ‌ద్ద‌రేసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌... ఐపీఎస్ స‌ర్వీసుకు వీడ్కోలు ప‌లికి మంగ‌ళ‌వారం నాటికి స‌రిగ్గా ఏడాది పూర్తవుతోంది. రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించాల‌న్న బ‌ల‌మైన కాంక్ష‌తో సాగిన ప్ర‌వీణ్ కుమార్‌... గ‌తేడాది జులై 19న ఐపీఎస్ స‌ర్వీస్‌కు స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరిన ఆయ‌న ఇటీవ‌లే ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు.
బీఎస్పీ నేత‌గా గ‌త కొంత‌కాలం క్రితం బ‌హుజ‌న యాత్ర పేరిట తెలంగాణ‌లో పాద‌యాత్ర మొద‌లుపెట్టిన ప్ర‌వీణ్ కుమార్ స‌మ‌కాలీన అంశాల‌పై స్పందిస్తూ సాగుతున్నారు. ప్ర‌వీణ్ చేప‌ట్టిన యాత్ర‌కు జ‌నం నుంచి కూడా భారీ స్పంద‌నే ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలో త‌న పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన విష‌యాన్ని మంగ‌ళ‌వారం గుర్తు చేసుకున్న ప్ర‌వీణ్... ఐపీఎస్ స‌ర్వీసుకు వాలంట‌రీ రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ తాను రాసిన లేఖ‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.