Team India: కోహ్లీ సలహాలతో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన సిరాజ్.. వీడియో వైరల్

  • రెండో ఓవర్లో బెయిర్ స్టో, రూట్ ను ఔట్ చేసిన సిరాజ్
  • ఓవర్ వేసే ముందు సిరాజ్ కు కీలక సూచనలు చేసిన కోహ్లీ
  • వాటిని పాటించి ఫలితం రాబట్టిన యువ పేసర్ 
Virat Kohlis Advice Help Siraj Scalp Two wickets in an over video gets viral

ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 259 పరుగులకే ఆలౌటవగా... రిషబ్ పంత్ అజేయ సెంచరీ, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ తో భారత్ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లండ్ రెండో ఓవర్లోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి డీలా పడింది. ఒక రకంగా మ్యాచ్ విజయంలో భారత్ కు అదే కీలకమైంది. ఈ రెండు వికెట్లూ హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ తీశాడు. దీనికి సిరాజ్ తో పాటు విరాట్ కోహ్లీకి కూడా క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టింది సిరాజే అయినా.. అతడిని వెనకుండి నడిపించింది మాత్రం కోహ్లీనే అనొచ్చు.

రెండో ఓవర్లో బౌలింగ్ చేయడానికి ముందు కోహ్లీతో సిరాజ్ మాట్లాడాడు. విరాట్ చెప్పిన మాటలను సిరాజ్ శ్రద్ధగా విన్నాడు. విరాట్ సలహాలను పాటిస్తూ యువ పేసర్ సిరాజ్ ఫలితం రాబట్టాడు. కోహ్లీ చెప్పిన విధంగా బాల్ వేసి ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టోను డకౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. 

ఆ తర్వాత రూట్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. రూట్‌ ఔట్‌కు ముందు కూడా సిరాజ్‌ వద్దకు పరిగెత్తుకొచ్చిన విరాట్ ఆఫ్‌స్టంప్‌ అవతల బంతిని వేయమని సలహా ఇచ్చాడు. తను చెప్పినట్టే సిరాజ్ ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వేసిన బంతిని వెంటాడిన రూట్‌ స్లిప్‌లో ఉ‍న్న రోహిత్‌ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ రెండు వికెట్లు పడగానే సిరాజ్ కోహ్లీని చూస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

More Telugu News