Dog: మద్యం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన శునకం.. 12 రోజులుగా రిమాండ్‌లో

Buxar Police arrested dog along with person for breaking prohibition law
  • విదేశీ మద్యం తరలిస్తూ పట్టుబడిన నిందితులు
  • కారులో ఉన్న శునకాన్నీ అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితులను జైలుకు పంపి దానిని మాత్రం స్టేషన్‌లోనే ఉంచుకున్న వైనం
  • తిండిపెట్టలేక అష్టకష్టాలు పడుతున్న పోలీసులు
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓ శునకం 12 రోజులుగా రిమాండ్‌లో ఉంది. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌‌లోని బక్సర్ జిల్లా ఘజీపూర్‌లో ఈ నెల 6న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో విదేశీ మద్యాన్ని తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు.. రామ్‌సురేష్ యాదవ్, భువనేశ్వర్ యాదవ్ పట్టుబడ్డారు. ఆ కారులో వారితోపాటు జర్మన్ షెపర్డ్ శునకం కూడా ఉండడంతో దానిని కూడా వారితోపాటే స్టేషన్‌కు తరలించారు. నిందితులిద్దరినీ జైలుకు పంపిన పోలీసులు శునకాన్ని మాత్రం పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. 

ఇప్పుడదే వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికి రోజూ ఆహారం పెట్టలేక పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. దానికి రోజూ పాలు, మొక్కజొన్న పెట్టాల్సి వస్తోందని బక్సర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ తెలిపారు. అది ఆంగ్లంలో ఇచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తోందని, హిందీలో చెబితే వినడం లేదని పేర్కొన్నారు. అది తినే టైమింగ్, ఏం తింటుందో తెలియకపోవడం ఇబ్బందిగా మారిందని ఆయన అన్నారు. 

మరోవైపు, దానికి తిండిపెట్టేందుకు రోజూ పెద్దమొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుండడంతో స్టేషన్ సిబ్బంది చందాలు వేసుకుంటున్నారు. ఆహారం విషయంలో అది ఏమాత్రం రాజీపడడం లేదని, ఆహారం విషయంలో కాస్త అటూ ఇటూ అయినా గట్టిగా మొరుగుతూ నానాయాగీ చేస్తోందని సిబ్బంది వాపోతున్నారు.
Dog
Bihar
Buxar
Arrest
Liquor Prohibition

More Telugu News