YSRCP: వైఎస్ జ‌గన్‌తో టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి భేటీ

  • ఖ‌మ్మం నుంచి తాడేప‌ల్లి వెళ్లిన పొంగులేటి
  • 2014లో ఖ‌మ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన వైనం
  • ఆ త‌ర్వాత వైసీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎంపీ
  • టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని అసంతృప్తి
trs leaders ponguleti srinivas reddy meets ap cm ys jagan at tadepally

తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌కు చెందిన కీల‌క నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి... ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో భేటీ అయ్యారు. ఖ‌మ్మం నుంచి తాడేప‌ల్లి వెళ్లిన పొంగులేటి సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు.

దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖర‌రెడ్డి బ‌తికి ఉండ‌గా అప్పుడ‌ప్పుడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన పొంగులేటి... నాడు క‌డ‌ప ఎంపీగా ఉన్న వైఎస్ జ‌గ‌న్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగారు. వైఎస్ఆర్ మృతి త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ‌గ‌న్ వైఎస్సార్సీపీ పేరిట కొత్త పార్టీ నెలకొల్పగా... పొంగులేటి కూడా జ‌గ‌న్ బాట‌లోనే న‌డిచారు. 2014 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్ స‌భ నుంచి వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పొంగులేటి విజ‌యం సాధించారు. త‌న‌తో పాటు ఖ‌మ్మం జిల్లా ప‌రిధిలోని ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచేలా ఆయ‌న ప‌నిచేశారు. 

అయితే రాష్ట్ర విభ‌జ‌న‌, క్ర‌మంగా తెలంగాణ‌లో వైసీపీ ప్రాభ‌వం త‌గ్గుతున్న నేప‌థ్యంలో వైసీపీని వీడిన పొంగులేటి అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం లోక్ స‌భ సీటును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్... పొంగులేటికి కాకుండా టీడీపీ నుంచి వ‌చ్చిన నామా నాగేశ్వ‌ర‌రావుకు ఇచ్చారు. 

ఈ క్ర‌మంలో త‌న‌కు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌న్న భావ‌న‌తో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు పొంగులేటి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పుడ‌ప్పుడు టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల్లో కనిపిస్తున్న ఆయ‌న తాను టీఆర్ఎస్‌లోనే ఉంటున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌గ‌న్‌తో పొంగులేటి భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

More Telugu News