ఇది సైలెంట్ కిల్లర్... నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ జబ్బు లక్షణాలు ఇవిగో!

  • చాపకింద నీరులా విస్తరించే కాలేయ వ్యాధి
  • ప్రపంచంలో ఎక్కువ మందిని బాధించే జబ్బు
  • లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదంటున్న నిపుణులు
  • బరువు నియంత్రణలో ఉంచుకోవాలని సూచన
Non Alcoholic Fatty liver decease symptoms

అతిగా మద్యం తాగేవారిలో లివర్ జబ్బులు సాధారణం. అయితే కొద్ది మోతాదులో మద్యం పుచ్చుకునేవారిలోనూ, మద్యం జోలికి వెళ్లనివారిలోనూ ఫ్యాటీ లివర్ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్ డీ) లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు చెబుతున్నారు. ఎన్ఏఎఫ్ఎల్ డీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే కాలేయ వ్యాధి. అసలు, ఈ వ్యాధి లక్షణాలు తమలో ముదురుతున్నాయని చాలామంది గుర్తించలేరట. ప్రారంభ దశలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడమే అందుకు కారణం. 

అయితే ఒక లక్షణం ద్వారా దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఉదయాన్నే నిస్సత్తువగా ఉంటే ఎన్ఏఎఫ్ఎల్ డీ లక్షణాల్లో ఒకటిగా భావించాల్సి ఉంటుంది. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట వీడకపోవడం, బద్ధకంగా ఉండడం కాలేయ వ్యాధికి సంకేతాలు. ఉదయాన్నే నీరసంగా ఉండడం అనే లక్షణం దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 

చదువు, ఉద్యోగం ఇలా ఏదైనా కానివ్వండి... ఆయా అంశాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. అంతేకాదు, మానసిక సంతులనం కోల్పోతారు. చిరాకు వంటి నెగెటివ్ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ఎన్ఏఎఫ్ఎల్ డీ ప్రారంభ లక్షణాలుగా భావించి వైద్యుడ్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మరో లక్షణం కూడా ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ను సూచిస్తుంది. పొట్టకు కుడివైపున పైభాగంలో తరచుగా నొప్పి వస్తుంటే అది ఫ్యాటీ లివర్ ప్రభావం అయ్యుండొచ్చు. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేస్తే నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (ఎన్ఏఎస్ హెచ్)కి దారితీస్తుంది. తద్వారా తీవ్రస్థాయిలో కాలేయ వాపు సంభవిస్తుంది. ఇది క్రమేణా సిర్రోసిస్ కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది. 

శరీరంలో అదనపు కొవ్వు చేరకుండా జాగ్రత్త వహించడమే ఈ ఫ్యాటీ లివర్ నివారణ మార్గాల్లో ప్రధానమైనది. బరువు తగ్గడం ద్వారా శరీరంలో కొవ్వు కణాల పెరుగుదలను తగ్గించవచ్చు. దైనందిన ఆహారంలో పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, చిక్కుళ్లు తీసుకోవడంతో పాటు, ఆలివ్ నూనె లేకపోతే ఆవ నూనెతో చేసిన వంటకాలను తినాలి. రోజూ ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయడం ద్వారానూ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రణలో ఉంచుకోవచ్చు. 

ఎక్కువకాలం మందులు వాడడం, మూలికలు, సప్లిమెంట్లు వంటివి తరచుగా తీసుకోవడం వల్ల కాలేయంలో విషపదార్థాలు పేరుకుపోతాయి. అందుకే సాధ్యమైనంతగా, ఎక్కువకాలం పాటు మందులు వాడకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రోజూ మద్యం తాగేవారు ఈ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

More Telugu News