నాలుగేళ్ల కిందటి భయానక క్షణాల నుంచి నేటి ఆశావహ జీవితం వరకు... సోనాలీ బెంద్రే భావోద్వేగ స్పందన

  • 2018లో క్యాన్సర్ బారినపడిన సోనాలీ బెంద్రే
  • అమెరికాలో చికిత్స.. కోలుకున్న వైనం
  • ఇటీవల న్యూయార్క్ ఆసుపత్రి సందర్శన
  • ముసురుకున్న పాత జ్ఞాపకాలు 
Sonali Bendre emotional post on her cancer recovery journey

ప్రముఖ నటి సోనాలీ బెంద్రే 2018లో క్యాన్సర్ బారినపడి, ఆపై అమెరికాలో చికిత్స పొంది మళ్లీ మామూలు మనిషయ్యారు. తాను గతంలో న్యూయార్క్ లో క్యాన్సర్ చికిత్స పొందిన ఆసుపత్రిని సోనాలీ బెంద్రే ఇటీవల దర్శించారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగాలకు గురయ్యారు. తన స్పందనను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. నాలుగేళ్ల కిందటి భయానక క్షణాల నుంచి నేటి ఆశావహ జీవితప్రస్థానం వరకు చాలా మార్పు సంభవించిందని, కొన్ని అంశాలు ఏ మార్పు లేకుండా అలాగే ఉన్నాయని  తెలిపారు. 

"అక్కడ ఆసుపత్రిలో కూర్చుని, వస్తూ పోతూ ఉండే రోగులను చూస్తూ ఉంటే  ఏదో కలలాగా అనిపించింది. నేను కూడా అలాంటి పరిస్థితులను అనుభవించాను కదా అన్న విషయం అనుభూతి చెందాను. ఆసుపత్రిలో నేను చికిత్స పొందిన కీమోథెరపీ సూట్ ను దర్శించాను, వెయిటింగ్ రూమ్ లోనూ మార్పేమీ లేదు. ముఖాలు మాత్రం కొత్తవి కనిపిస్తున్నాయంతే. మీరేమీ బాధపడవద్దు... జీవితంపై మమకారాన్ని పెంచుకోండి, బ్రతుకుపై దృఢవిశ్వాసాన్ని కలిగి ఉండండి అని వాళ్లతో గట్టిగా చెబుతున్నట్టుగా అనిపించింది. నిన్నటి వరకు క్యాన్సర్ రోగిగా ఉన్న నేను కోలుకుని మామూలు వ్యక్తిలా ఇవాళ ఆసుపత్రికి వచ్చాను.

ఇదొక చేదుతీపిల సమ్మేళనంలా భావిస్తాను. ఆసుపత్రి నుంచి బయటికి వస్తూ, నా కొడుకు కళ్లలోకి చూశాను. సూర్యకాంతి నా ముఖంపై  పడుతుండగా, జీవిత సర్వస్వాన్ని నాకిచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదాలు చెప్పుకున్నాను" అంటూ సోనాలీ బెంద్రే పోస్టు చేశారు. ఈ మేరకు తన భర్త గోల్డీ బెహల్ తో కలిసి ఆసుపత్రిలో ఉన్నప్పటి ఫొటోలను కూడా పంచుకున్నారు.

More Telugu News