Telangana: తెలంగాణలో రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ పరీక్షలు వాయిదా

  • భారీ వర్షాల నేపథ్యంలో అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేసిన ఉన్నత విద్యామండలి
  • ఈ నెల 18, 19, 20న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు యాథాతదంగా జరుగుతాయని ప్రకటన
  • ఈ సారి ఎంసెట్ కు భారీగా పోటీ పడుతున్న విద్యార్థులు 
EAMCET exams scheduled to be held in Telangana today and tomorrow have been postponed

తెలంగాణలో కుండపోత వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని తెలిపింది. 

అయితే, అదే సమయంలో  ఈ నెల 18,19, 20 న జరగాల్సిన ఎంసెట్ ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు మాత్రం యథావిధిగా జరగనున్నాయని తెలిపింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం ప్రకటన చేశారు. 

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్‌ పరీక్షలు.. 18, 19, 20 తేదీల్లో ఇంజినీరింగ్‌ అర్హత పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ, వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పలు జిల్లాల్లో ఇప్పటికీ ఎంసెట్  ఏర్పాట్లు ఇంకా మొదలే కాలేదు. 

ఈ పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్షకు హాజరవడం కష్టమవుతుందని, ఎంసెట్ ను వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో గురు, శుక్రవారాల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఉన్నత విద్యా మండలి వాయిదా వేస్తూ నిర్ణయ తీసుకుంది. ఈ సారి ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి 1,71,945 మంది దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150 మంది పోటీ పడుతున్నారు.

More Telugu News