National Emblem: పార్లమెంటులో ప్రతిష్ఠించిన భారీ జాతీయ చిహ్నంపై విమర్శలు.. తయారీదారుల స్పందన ఇదే!

Makers of National emblem on new Parliament response on differences
  • 2.5 అడుగుల ఒరిజినల్ శిల్పాన్ని తాము ఎన్నో రెట్లు పెద్దదిగా చేశామని వివరణ 
  • ఈ చిహ్నాన్ని కనీసం 100 మీటర్ల దూరం నుంచి చూడాల్సి ఉంటుందని సలహా 
  • ఒరిజినల్ శిల్పంలోని డ్యామేజీలు కూడా తేడాలకు కారణం కావచ్చని వ్యాఖ్య 
కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. సారనాథ్ లోని అశోక స్తూపంపై ఉన్న సింహాలకు, వీటికి ఎంతో తేడా ఉందని విమర్శిస్తున్నాయి. ఎంతో హుందాగా, శాంతిని ప్రబోధిస్తున్నట్టు ఉండే నాలుగు సింహాలు... ఈ శిల్పంలో చాలా క్రూరంగా, దౌర్జన్యకరంగా కనిపిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తక్షణమే వాటిని మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో, దీని తయారీదారులు స్పందిస్తూ... పెద్ద సైజులో దీన్ని తయారు చేయడం వల్ల... కొన్ని తేడాలు పెద్దవిగా కనిపించవచ్చని అన్నారు. ప్రాజెక్టు ఇన్చార్జి సునీల్ దేవర్ మాట్లాడుతూ, ఒరిజినల్ శిల్పంలో కొన్ని డ్యామేజీలు ఉన్నాయని.. ఈ డ్యామేజీలు కూడా తాము తయారు చేసిన దాంట్లో తేడాలకు కారణం కావచ్చని అన్నారు. 

మ్యూజియంకు వెళ్లి అక్కడ ఉన్న శిల్పంపై తాము రీసర్చ్ చేశామని తెలిపారు. 2.5 అడుగుల ఎత్తున్న ఒరిజినల్ శిల్పాన్ని తాము ఎన్నో రెట్లు పెద్దదిగా తయారు చేశామని చెప్పారు. పార్లమెంటు భవనంపై పెట్టిన, తాము తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని కనీసం 100 మీటర్ల దూరం నుంచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. కాబట్టి అంత దూరం నుంచి చూసినప్పుడు అది సరిగ్గా కనిపించేలా తాము తయారు చేశామని తెలిపారు.  

తాము తయారు చేసిన చిహ్నం దగ్గర నుంచి చూసేది కాదని, ఎవరైనా సరే దాన్ని చాలా దూరం నుంచి చూడాల్సిందేనని చెప్పారు. ఈ దూరం వల్ల ఒరిజినల్ కి, తాము తయారు చేసిన దానికి ఏమాత్రం తేడా కనిపించదని... రెండూ ఒకేలా కనిపిస్తాయని అన్నారు.
National Emblem
New Parliament
Difference
Makers

More Telugu News