YSRCP: 'వైసీపీ శాశ్వత అధ్యక్ష తీర్మానం'పై ఎన్నికల కమిషన్‌కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

  • రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలన్న రఘురామ 
  • ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని వ్యాఖ్య
  • జగన్ శాశ్వత సీఎం అని అసెంబ్లీలో తీర్మానం చేస్తారేమోనని ఎద్దేవా 
MP Raghurama complaints to the Election Commission on YCPs permanent presidential resolution

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కొనసాగించాలని వైసీపీ ప్లీనరీలో చేసిన తీర్మానంపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. దేశంలో రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటి మేరకు నడుచుకుంటామని పార్టీలు ముందే అంగీకార పత్రం ఇవ్వవలసి ఉంటుందని ఆయన అన్నారు. ఇష్టారీతిగా వ్యవహరిస్తామంటే కుదరదని ఇదే విషయమై తాను ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారికి లేఖ రాసినట్టు వెల్లడించారు. 
 
ఒకవేళ రాజకీయ పార్టీకి శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదనను ఎన్నికల కమిషన్ అంగీకరిస్తే... అన్ని పార్టీలకు జగన్‌ మార్గదర్శిగా నిలుస్తారని అన్నారు. మరో పాతికేళ్ల పాటు ముఖ్యమంత్రి జగనే అని వైసీపీ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆశ్చర్యం లేదని రఘురామ ఎద్దేవా చేశారు.  

ఇక, తన గురించి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను, ఆ భాషను చూసిన ప్రజలు మళ్లీ వైసీపీకి ఓటే వేయరని రఘురామ అన్నారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పయ్యావుల కేశవ్‌కు రక్షణ సిబ్బందిని తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కానీ, ఆయన కదలికలు తెలుసుకోవడానికి సిబ్బందిని మార్చి, తమ వాళ్లను నియమించే అవకాశం ఉందని రఘురామ అభిప్రాయపడ్డారు.

More Telugu News