China: 33 సంవత్సరాలుగా మగాడుగా బతికాక.. ఇప్పుడతను ‘ఆమె’ అని తెలిసి అంతా షాక్!

Chinese man finds out he has a uterus and ovaries at age 33
  • చైనాలో ఘటన.. మూత్రంలో రక్తం, కడుపులో మంట
  • ఆపరేషన్ చేసినా ఫలితం శూన్యం
  • రుతుస్రావం వల్లే మూత్రంలో రక్తం వస్తోందని గుర్తించిన వైద్యులు
  • గర్భాశయం సహా పూర్తిస్థాయిలో స్త్రీ అవయవాలు
  • అతడిని ‘ఇంటర్‌సెక్స్’గా గుర్తించిన వైద్యులు
33 సంవత్సరాల పాటు పురుషుడిగా జీవించిన అతడు ఇప్పుడు తాను ‘ఆమె’ అని తెలియడంతో కుంగిపోయాడు. తాను పురుషుడిగానే జీవించాలని అనుకుంటున్నానని చెప్పడంతో వైద్యులు తనని ‘మగాడి’ గా మార్చారు. చైనాలో జరిగిన ఈ ఘటన వైద్యులనే ఆశ్చర్యానికి గురిచేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన ఓ వ్యక్తికి తరచూ మూత్రంలో రక్తం రావడంతోపాటు నాలుగు రోజులపాటు కడుపు నొప్పి వేధించేది. అతడిని పరీక్షించిన వైద్యులు అపెండిక్స్ అయి ఉంటుందని ఆపరేషన్ చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో అతడిని పూర్తిస్థాయిలో పరీక్షించిన వైద్యులు విస్తుపోయారు. 

అతడు ‘అతడు’ కాదని, ‘ఆమె’ అని తెలిసి షాకయ్యారు. అతడిలో స్త్రీ క్రోమోజోములు ఉన్నట్టు గుర్తించారు. అతడి సమస్యకు అనారోగ్యం కారణం కాదని, రుతుస్రావం వల్లే మూత్రంలో రక్తం వస్తోందని తెలిసి ఆశ్చర్యపోయారు. కడుపు నొప్పికి అదే కారణమని తెలుసుకున్నారు. 

అతడు పూర్తిస్థాయి పురుషుడు కాదని, స్త్రీపురుష క్రోమోజోములు కలిసిన ‘ఇంటర్ సెక్స్’ అని వైద్యులు తెలిపారు. అతడికి గర్భాశయం, అండాశయాలతోపాటు స్త్రీ పునరుత్పత్తి అవయవాలు కూడా ఉన్నాయని పరీక్షల్లో గుర్తించారు. స్త్రీ సెక్స్ హార్మోన్లు, అండాశయ కార్యకలాపాల స్థాయులు కూడా ఆరోగ్యకరమైన మహిళకు ఉన్నట్టుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, పురుష సెక్స్ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయులు సగటు కంటే తక్కువ ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు, 33 సంవత్సరాలపాటు పురుషుడిగా జీవించిన అతడు ఇప్పుడు తాను ఆమె అని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనలో ఉన్న స్త్రీ అవయవాలను తొలగించి పురుషుడిగానే ఉంచాలని వేడుకున్నాడు. దీంతో తాజాగా అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతడిలోని స్త్రీ అవయవాలను మొత్తం తొలగించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు చెప్పారు.
China
Uterus
Doctors
Intersex
Chromosome

More Telugu News