Virat Kohli: రేపు ఇంగ్లండ్ తో టీమిండియా తొలి వన్డే... కోహ్లీ ఆడే అవకాశాలు తక్కువేనన్న బీసీసీఐ

  • ముగిసిన టీ20 సిరీస్
  • మూడు వన్డేల సిరీస్ కు రంగం సిద్ధం
  • ఆప్షనల్ ప్రాక్టీసుకు కోహ్లీ దూరం
  • గజ్జల్లో గాయం కారణం కావొచ్చన్న బీసీసీఐ!
BCCI says Kohli likely injured

ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ నెగ్గి ఉత్సాహంగా ఉన్న టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్ కు సిద్ధమవుతోంది. టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రేపు (జులై 12) జరగనుంది. ఈ మ్యాచ్ కు లండన్ లోని ఓవల్ మైదానం వేదిక. కాగా, నేడు టీమిండియా ఆటగాళ్ల ఆప్షనల్ ప్రాక్టీసుకు విరాట్ కోహ్లీ హాజరుకాలేదు. దాంతో కోహ్లీ రేపటి మ్యాచ్ లో ఆడతాడా, లేడా అనేదానిపై అస్పష్టత నెలకొంది. 

దీనిపై బీసీసీఐ వర్గాలు వివరణ ఇచ్చాయి. కోహ్లీ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోందని, అతడు రేపు ఇంగ్లండ్ తో తొలివన్డే మ్యాచ్ లో ఆడే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నాయి.

గత రెండేళ్లుగా భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతున్న కోహ్లీ, ఇటీవల మరీ పేలవంగా ఆడుతూ విమర్శకులకు పనికల్పిస్తున్నాడు. కోహ్లీ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవాళీ క్రికెట్ ఆడితేనే కోహ్లీ మళ్లీ గాడినపడతాడని మరికొందరు మాజీలు సలహా ఇస్తున్నారు. ఇవేవీ పట్టించుకోని కోహ్లీ టీమిండియాలో కొనసాగుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.

More Telugu News