Science: ఇక టమాటాలతోనూ 'డీ' విటమిన్.. శాస్త్రవేత్తల సరికొత్త పరిశోధన

  • అత్యాధునిక క్రిస్పర్‌ టెక్నాలజీతో జన్యు మార్పిడి టమాటాలు
  • ఒక్కో టమాటాలో రెండు కోడిగుడ్లతో సమానంగా విటమిన్ డీ
  • వంకాయలు, ఆలుగడ్డల్లోనూ ఈ తరహా మార్పులు చేయవచ్చంటున్న శాస్త్రవేత్తలు
scientists create tomatoes genetically engineered to boost vitamin d

ఇప్పుడంతా ఎండ అన్నదే చూడకుండా అయిపోతున్నారు. అయితే ఇంట్లో, లేకుంటే ఆఫీసులోనో, స్కూల్ లో.. ఆరు బయట ఆటపాటల్లేవ్. ఎండలో కష్టపడే పనిలేదు. దీనితో ఎక్కడ చూసినా డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆహారం ద్వారా విటమిన్ డీ అందే అవకాశాలు చాలా తక్కువ. 

ఎందుకంటే ఆహారంలో విటమిన్ డీ చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నా విటమిన్ కన్నా పూర్వ రూపమైన అమైనో ఆమ్లాల రూపంలో ఉంటుంది. మనం ఎండలో నిలబడినప్పుడు సూర్యరశ్మిని గ్రహించి శరీరంలో విటమిన్ డీ తయారవుతుంది. కానీ ఎండలో నిలబడేందుకు సమయం లేకపోవడం సహా ఎన్నో కారణాలు ఇబ్బందిగా ఉంటున్నాయి. 

ఈ క్రమంలోనే ఆహారం ద్వారా సమృద్ధిగా విటమిన్ డీ అందించడంపై ఇంగ్లాండ్ కు చెందిన జాన్ ఇన్నెస్ సెంటర్ వృక్ష శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో టమాటాల్లో గణనీయంగా విటమిన్ డీ ఉత్పత్తి అయ్యేలా సరికొత్త పరిశోధన చేపట్టారు.

డి విటమిన్ లేకుంటే ఎన్నో సమస్యలు..
శరీరంలో తగినంత విటమిన్‌ -డీ ఉంటే కాల్షియం, ఫాస్పరస్‌ వంటి కీలక పోషకాలను శరీరం బాగా సంగ్రహించగలుగుతుంది. ఒకవేళ విటమిన్ డీ సరిగా అందకుంటే ఎన్నో అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎముకలు బలహీనపడటంతోపాటు గుండెజబ్బులు, కొన్ని రకాల కేన్సర్లకూ దారి తీస్తుంది. 

టమాటాల్లో జన్యువులను మార్చి..
జంతువులు, మొక్కలు సహా జీవులేవైనా వాటిలో జన్యు పదార్థం ఉంటుంది. అందులో వేలకొద్దీ జన్యువులు ఉంటాయి. అవే ఆయా జీవుల రూపం, లక్షణాలను నిర్దేశిస్తాయి. అలాంటి జన్యువుల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుకల్పించే సాంకేతికతను ‘క్రిస్పర్ టెక్నాలజీ’ అంటారు. తాజాగా శాస్త్రవేత్తలు టమాటాల్లో క్రిస్పర్ టెక్నాలజీతో జన్యుమార్పిడి చేసి.. వాటిల్లో సమృద్ధిగా విటమిన్ డి తయారయ్యేలా చేయగలిగారు. ఈ జన్యుమార్పులు చేసిన టమాటా ఒక్కోదాంట్లో రెండు కోడిగుడ్లలో ఉండేటంత విటమిన్‌ -డీ ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టమాటాలను ఎండపెట్టడం ద్వారా దీని పరిమాణం మరింతగా పెరుగుతుందని అంటున్నారు.
ఒక్క టమాటాలే కాకుండా వంకాయ, ఆలుగడ్డల్లో కూడా క్రిస్పర్ సాంకేతికత సాయంతో విటమిన్ డీ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

More Telugu News