Perni Nani: మూడేళ్ల నుంచి ఏం దహించుకున్నావు... శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నావు కదా: పవన్ పై పేర్ని నాని విమర్శలు

Perni Nani slams Pawan Kalyan
  • వైసీపీ సర్కారుపై పవన్ విమర్శనాస్త్రాలు
  • పవన్ చిలకజోస్య ప్రావీణ్యుడని పేర్ని నాని ఎద్దేవా
  • వీకెండ్ ప్రజాసేవ చేస్తుంటాడని విమర్శలు
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విజయవాడలో జనవాణి కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం పవన్ మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పవన్ కల్యాణ్ ది వీకెండ్ ప్రజాసేవ అని ఎద్దేవా చేశారు. సెలవు రోజున వచ్చి ప్రజాసేవ చేస్తుంటాడని, ఇలాంటివాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. పవన్ షూటింగులకే కాదని, రాజకీయాల్లోనూ ఆలస్యమేనని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 

"నిన్న విజయవాడలో ఒకాయన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. గతంలో ప్రజాసేవకే తన జీవితం అంకితమన్న ఆ వ్యక్తి ఇవాళ డబ్బుల కోసం సినిమాలు చేస్తున్నానని అంటున్నాడు. వందల కోట్ల ఆదాయాన్ని వదులుకుని మీకోసం వచ్చానంటూ గతంలో చెప్పిన డబ్బా మాటలు మనం విన్నాం. ఇప్పుడేమో వీకెండ్ లో వచ్చి ప్రజాసేవ చేస్తున్నాడు. ప్రజాసేవలో ఆయన పద్ధతులు తమాషాగా ఉన్నాయి. ఈయనొక వింత పోకడలు ఉన్న రాజకీయనేత. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తారని ఎవరూ ఊహించి ఉండరు.  

ఇతడు షూటింగులకు ఆలస్యంగా వెళతాడని చెప్పుకుంటారు... కానీ రాజకీయాలకు కూడా ఆలస్యమే. నిన్న ఆయన చెప్పిన లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను ఏపీ ప్రజలు మూడేళ్ల కిందటే స్వీకరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ ముగ్గురూ కలిసి ఏర్పాటు చేసిన విషకూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఖాళీ చేయించారు. ఆ కుర్చీ ఖాళీ అయి చాలా రోజులైతే, అందులో ఇంకా చంద్రబాబు ఉన్నారనే భ్రమలో ఉన్నట్టున్నాడు. 

అసలు నిన్ను (పవన్) అసెంబ్లీ గేటును ఎవరు తాకొద్దన్నారు? వెళ్లి భీమవరం, గాజువాక ప్రజలనే అడుగు. లేకపోతే గ్రంధి శ్రీను, నాగిరెడ్డిలను అడుగు. వారు కదా నిన్ను అసెంబ్లీకి దూరం చేసింది. ఇందులో సీఎం జగన్ కు ఏమిటి సంబంధం?" అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. 

అంతేకాదు, నిన్న పవన్ మాటలు వింటుంటే చాగంటి కోటేశ్వరరావును మించిపోయేలా ప్రవచనాలు చెప్పాడని విమర్శించారు. నిన్నటి ప్రవచనాలతో పవన్ కు మతిమరుపు కూడా ఉందని జనం నవ్వుకుంటారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చిలుక జోస్యం చెప్పడంలో పండితుడని, 2019లో సీఎం జగన్ సీఎం కాలేడని, ఇది పవన్ శాసనం అని చెప్పారని పేర్ని నాని వెల్లడించారు. కానీ జగన్ ప్రజలనే నమ్ముకున్నారని, వచ్చే ఎన్నికల్లోనూ ఆయన ప్రజలపైనే ఆధారపడతారని తెలిపారు. పవన్ లాగా చంద్రబాబు, మోదీ, కేసీఆర్ లను జగన్ నమ్ముకోలేదని విమర్శించారు. 

పవన్ నిన్నటి ప్రసంగంలో తనను తాను దహింపజేసుకోవడానికి సిద్ధం అంటున్నాడని, భార్యాపిల్లలు ఉన్నా అందుకు సిద్ధమే అంటున్నాడని వ్యాఖ్యానించారు. పైగా, మీరందరూ రావాలని కూడా పిలుపునిస్తున్నాడని అన్నారు. "శుభ్రంగా బాగానే ఉన్నావు కదా... అయినా ఏం దహించుకుంటావు? మూడేళ్ల నుంచి ఏం దహించుకున్నావు? హాయిగా సినిమాలు చేసుకుంటున్నావు కదా! బండెనక బండి కట్టి... ఏ బండిలో వస్తవో అనే పాట ఉంది కదా... ఆ పాట తరహాలోనే ఇన్ని బండ్లలో సోకుగా తిరుగుతున్నావు" అంటూ విమర్శించారు. 

అంతేకాదు, "ఈయన రౌడీయిజాన్ని సహించలేడు... ఇంతకంటే పోటుగాడు లేడు. అనంతపురంలో ఎవరింటికి వెళ్లి కాఫీ తాగారు? వాళ్లు ఎవరు? వాళ్లకు శాలువా కప్పడానికి వెళ్లారా? వాళ్లు ఎంతమందిని చంపారు?" అంటూ పవన్ ను పేర్ని నాని ప్రశ్నించారు.
Perni Nani
Pawan Kalyan
YSRCP
Janasena
Andhra Pradesh

More Telugu News